మునుపెన్నడూ చూడనివి చూసే సమయమిది.. మునుపెన్నడూ విననివి వినే సమయ మిది.. ఇప్పటివరకు తెలియనివి తెలుసుకునే సమయమిది.. అంటు సినిమా మీద అంచనా లు పెంచేశారు దర్శకుడు వెంకట్ ప్రభు. తమిళ హీరో విజయ్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)’. సెప్టెంబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. కాగా శనివారం విజయ్ పుట్టినరోజు సందర్భం గా ఓ టీజర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.
డైలాగ్స్ లేని ఈ టీజర్ చేజింగ్ సన్నివేశంతో యాక్షన్ ప్రధానంగా కనపడుతుండగా, హీరో విజయ్ డబుల్ యాక్షన్‌తో సందడి చేశారు. ‘గోట్’లో విజయ్ రెండు పాత్రల్లో కనపడనున్నారని ముందు నుండి వినవస్తున్నదే. ప్రస్తుత వయసు కంటే చిన్నవాడిగా ఓ పాత్రలో విజయ్ నటించారు. ఇందుకోసం యాంటీ ఏజింగ్ టెక్నాలజీని వాడగా, తెరపై తమ అభిమాన హీరోని ఇలా చూడటం బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు విజయ్ అభిమానులు.
భావోద్వేగానికి గురైన యువన్
ఇదిలా ఉంటే.. ఈ చిత్రం నుంచి “చిన్న చిన్న కాంగళ్..” అంటూ సాగే గీతం శనివారం విడుదలైంది. ఈ సందర్భంగా స్వరకర్త యువన్ శంకర్ రాజా తన సోదరి, ఇటీవల మరణించిన గాయని అయిన భవతరణిని తలచుకుని ఆవేదన చెందారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాలలో పెడుతూ “ఈ పాట స్వరపరిచే సమయంలో భవతారణి ఆసుపత్రిలో ఉన్నారని, ఆమె కోలుకోగానే ఈ పాటని తనతో పాడించాలనుకోగా గంట వ్యవధిలోనే తను లేరన్న వార్త చెవిన పడిందన్నారు. ఏఐ సాయంతో ఈ పాటకి ఆమె గాత్రాన్ని వాడిన యువన్, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదన్నారు. తన బృందంతో పాటు ఈ క్రమంలో తనకు సహకరించిన వారందరికి ఈ సందర్భంగా ధన్యవా దాలు” తెలిపిన యువన్, ఇది తనకు రెండు రకాల అనుభూతులనిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.