calender_icon.png 22 September, 2024 | 10:05 AM

అనాథాశ్రమంలో వార్డెన్ దాష్టీకం

22-09-2024 12:55:46 AM

విద్యార్థినులపై దూషణ, దాడి

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలికలు

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 21: అనాథాశ్రమంలో ఓ వార్డెన్ దాష్టీకానికి పాల్పడింది. విద్యార్థినులను దూషిస్తూ దాడులకు పాల్పడుతోంది. వార్డెన్ వేధింపులు భరించలేని విద్యార్థులు షీ టీం సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో కథనం ప్రకారం.. కిస్మత్‌పూర్‌లో చెరిష్ అనే అనాథాశ్రమం ఉంది. దీనిని నీలిమా అనే మహిళ నిర్వహిస్తున్నారు. అందులో సుమారు 45 మంది విద్యార్థినులు ఉన్నారు. వీరిలో 6వ తరగతి నుంచి ఇంటర్, ఆపై చదివే బాలికలు ఉన్నారు.

ఇదిలా ఉండగా, హాస్టల్‌లో సునీత అనే మహిళ వార్డెన్‌గా పనిచేస్తోంది. కొంతకాలంగా ఆమె బాలికలను అకారణంగా దూషిస్తూ, కొడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. బాలికల్లో కొందరు బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. వార్డెన్ వేధింపులు భరించలేని 12 మంది విద్యార్థినులు జరిగిన విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఇతర ఉపాధ్యాయులకు తెలిపారు. దీంతో వారు షీ టీమ్‌కు సమాచారం ఇచ్చారు. షీ టీమ్ సిబ్బంది శుక్రవారం సాయంత్రం పాఠశాలకు వచ్చి విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

వారి సూచనతో రాజేంద్రనగర్ పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో జిల్లా సీడబ్ల్యూసీ అధికారు లకు సమాచారం ఇవ్వడంతో వారు శనివారం ఉదయం హాస్టల్ నుంచి 12 మంది విద్యార్థినులను నింబోలి అడ్డాలోని స్త్రీ,శిశు సంక్షేమ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ వారి స్టేట్‌మెంట్‌ను నమోదు చేసుకొని తిరిగి హాస్టల్‌కు పంపారు. విద్యార్థుల ఫిర్యాదు మేరుకు హాస్టల్ వార్డెన్ సునీతపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.