ఎస్పీ రోహిత్ రాజ్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తెప్పోత్సవం, వైకుంఠ ద్వార దర్శన మహోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భాద్యతగా విధులు నిర్వర్తించాలనీ ఎస్పి రోహిత్ రాజ్(SP Rohith Raju) అధికారులను ఆదేశించారు. బుధవారం సెక్టార్ల వారీగా కేటాయించిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఈ నెల 9,10వ తారీఖులలో జరగనున్న నేపథ్యంలో భద్రాచలంలోని ఏఎస్పీ కార్యాలయం నందు గల కాన్ఫరెన్స్ హాలులో సెక్టార్ల వారీగా కేటాయించబడిన అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అత్యంత వైభవంగా జరగనున్న తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శన ప్రదేశాలలో విధులు నిర్వర్తించే అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. 1300 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ రెండు రోజుల పాటు భద్రాచలం పట్టణంలో జరిగే ఉత్సవాలకు పోలీసు వారు సందర్భానుసారంగా విధించే ఆంక్షలకు ప్రజలు సహకరించాలని కోరారు.