calender_icon.png 23 October, 2024 | 5:58 AM

83 ఎకరాల భూమి కబ్జాకు యత్నం

23-10-2024 01:47:53 AM

సినీ నిర్మాత శివరామకృష్ణతో పాటు మరో ఇద్దరి అరెస్ట్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ఆకాశాన్ని తాకే కట్టడాలు.. చుట్టూ సాఫ్ట్‌వేర్ కంపెనీలు.. నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఆ ఏరియా ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం అక్కడ ఒక ఎకరం భూమి ధర రూ.100 కోట్ల పైనే ఉంటుంది.

అలాంటి ఏరియాలో ఏకంగా 83 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు యత్నించాడు ఓ సినీ నిర్మాత. చివరికి పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి..  రాయ దుర్గం ప్రాంతంలో 83 ఎకరాల ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన స్థలం ఉంది. ఆ భూమిపై టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కన్నుపడింది. దాన్ని ఎలాగైనా కాజేయాలని పథకం రచించాడు.

ఇందుకోసం స్టేట్ ఆర్కియాలజీ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కొత్తింటి చంద్రశేఖర్ సహాయంతో నకిలీ పత్రాలు సృష్టించాడు. సదరు భూమి తనదేనంటూ శివరామకృష్ణ కోర్టులో క్లెయిమ్ చేసుకున్నాడు. మరో వ్యక్తి బిల్డర్ మారగోని లింగమయ్య గౌడ్ సహాయంతో ఆ భూమిలో పాగా వేశాడు.

శివరామకృష్ణ నకిలీ పత్రాలతో భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆర్కియాలజీ విభాగం డైరెక్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2003లో అప్పటి ప్రభుత్వం దీనిపై కోర్టులో కేసు వేసింది. ప్రభుత్వాలు మారినా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం కొనసాగింది.

చివరికి శివరామకృష్ణవి నకిలీ పత్రాలని సుప్రీంకోర్టు తేల్చింది. ఈ తీర్పుతో శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగమయ్య గౌడ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.

కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువరాజు, ప్రేమంటే ఇదేరా, దరువు, యువత, రైడ్, ఏమో గుర్రం ఎగరావచ్చు, అందరి బంధువయ వంటి సినిమాలకు శివరామకృష్ణ నిర్మాతగా వ్యవహరించారు.