calender_icon.png 17 March, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

400 ఎకరాలు ప్రభుత్వానిదే

15-03-2025 12:00:00 AM

  1. ఈ భూమితో హెచ్‌సీయూకు సంబంధం లేదు
  2. దానిని గ్రీన్‌స్పేస్‌గా అభివృద్ధి చేస్తాం:  టీజీఐఐసీ

హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ముమ్మాటికీ ప్రభుత్వ భూమేనని టీజీఐఐసీ తెలిపింది. కొందరు ఈ భూమిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం సమగ్ర వివరాలు తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది.

అందులో వెల్లడించిన ప్రకారం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2004, జనవరి 13న రంగారెడ్డి జిల్లా సేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నెం.25లో ఉన్న 400 ఎకరాల భూమిని ఐఎంజీ అకాడమీస్‌కు క్రీడా సదుపాయాల అభివృద్ధి కోసం కేటాయించింది. ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కాకపోవడంతో 2006, నవంబర్ 21న ఈ కేటాయింపును అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. ఐఎంజీ కోర్టుకు వెళ్లింది.

కోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత 2024, మార్చి 7న ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఐఎంజీ సుప్రీంకు వెళ్లగా అత్యున్నత న్యాయస్థానం సైతం 2024, మే 3న పిటిషన్‌ను తిరస్కరించింది. ఇలా ఎంతో విలువైన ఈ ప్రభుత్వ భూమిని సర్కార్ రక్షించింది. తర్వాత టీజీఐఐసీ అభ్యర్థన మేరకు సదరు భూమిని సేరిలింగంపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదుచేశారు.

2024, జూన్ 19న ఐటీ, ఇతర ప్రాజెక్టుల కోసం ఈ ప్రభుత్వ భూమిని తమకు కేటాయించాలని టీజీఐఐసీ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో 2024, జూన్ 26న రెవెన్యూ విభాగం ప్రధాన కార్యదర్శి టీజీఐఐసీకి 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఈ భూమితో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి ఎలాంటి సంబంధం లేదని తేలింది.

ఈ మేరకు స్పష్టమైన సరిహద్దులను కూడా నిర్ధారించారు. కొందరు ఆరోపిస్తున్నట్టు ఈ భూమి పక్కనే ఉన్న నెమలిచెరువు, పుట్టగొడుగు రాళ్లు టీజీఐఐసీ ద్వారా అభివృద్ధి చేస్తున్న 400 ఎకరాల భూమిలో భాగం కాదు.

మశ్రూమ్ రాక్ వంటి రాక్ ఫార్మేషన్స్‌ను గ్రీన్‌స్పేస్‌గా సంరక్షించే లేఅవుట్‌ను టీజీఐఐసీ తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. హెచ్‌సీయూ భూమిని గానీ, చెరువులు, పుట్టగొడుగు రాళ్ల సముదాయాన్ని గానీ తాము ఆక్రమించలేదని టీజీఐఐసీ స్పష్టం చేసింది.