calender_icon.png 6 March, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10వ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

06-03-2025 06:24:34 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): ఈ నెల 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్న ఎస్.ఎస్.సి. వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలను మండల తహశిల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్ లతో కలిసి సందర్శించి వంటశాల, భోజనశాల, హాజరు పట్టికలు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, శౌచాలయాలు, ప్రహారీగోడ ఇతర మౌళిక సదుపాయాలు కల్పించడంతో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన అందిస్తుందన్నారు.

విద్యార్థుల సౌకర్యార్థం డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచిందని తెలిపారు. విద్యార్థులకు సకాలంలో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. రానున్న 10వ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఉపాధ్యాయులు విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా వారి తల్లిదండ్రులతో మాట్లాడాలని ఉపాధ్యాయులకు సూచించారు.

అనంతరం మండల కేంద్రంలో కొనసాగుతున్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను సందర్శించి త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు, గుత్తేదారుల సమన్వయంతో పని చేయాలని తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్టర్లు పరిశీలించారు. మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, మున్సిపాలిటీలో ఆస్తి పన్నులను 100 శాతం వసూలు చేసి పురపాలక సంఘ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.