13-03-2025 02:00:33 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, మార్చి 12 (విజయ క్రాంతి): విద్యార్థులు శ్రద్ధతో చదివి పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థులకు సూచించారు. బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలాజీ సేవాసమితి ఆధ్వర్యంలో కరీంనగర్ లోని 20 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 700 మంది పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ సంస్థ సేవలు అభినందనీయమని అన్నారు. సమయాభావం వల్ల పదో తరగతి విద్యార్థులు ఇంటి నుండి ఏమీ తినకుండా పాఠశాలకు వస్తారని, ఈ అల్పాహారం తీసుకోవడం వల్ల వారు చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టే అవకాశం ఉందని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టడం వల్ల తల్లిదండ్రులకు నమ్మకం పెరిగిందని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలోనూ ఈ సేవలు విస్తరింప చేయాలని సేవాసమితి సభ్యులను కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ అల్పాహారం తిన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు రాజేందర్, బాలాజీ సేవా సమితి అధ్యక్షులు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.