calender_icon.png 13 January, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక లక్ష్యాన్ని సాధించండి

12-01-2025 12:00:00 AM

  1. సిప్ చేయండి.. 
  2. నెలనెలా పొదుపుతో పెద్ద మొత్తాన్ని సమకూర్చుకునే సాధనం
  3. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్

క్రమం తప్పకుండా మదుపుచేయడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల్ని సాధించడానికి సిస్టామ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (సిప్‌లు) తప్ప మరో పెట్టుబడి సాధనం లేదని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు చెపుతుంటారు. పలు మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఈ ప్లాన్స్ ద్వారా మదుపు చేయవచ్చు.

ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా రిటైర్‌మెంట్ ఫండ్, కొత్త గృహం కొనుగోలు, పిల్లల ఉన్నత చదువులు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఇవి  అనువైనవి. మీరు చేసే మదుపును మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్, బాండ్లు తదితరాల్లో పెట్టుబడి చేస్తాయి.

వాటితో వచ్చే లాభాలను తిరిగి పెట్టుబడి చేసి అదనపు రాబడుల్ని తీసుకురావడం ద్వారా మీ డబ్బును వృద్ధి చేస్తాయి. దీర్ఘకాలం పాటు వీటిలో పెట్టుబడి చేస్తేనే ఈ ప్రయోజనం లభిస్తుంది. దీంతో పాటు  మ్యూచువల్ ఫండ్స్ నిర్వహించే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్  క్రమశిక్షణతో పెట్టుబడి చేసే అలవాటును కూడా ఇన్వెస్టర్లకు అలవరుస్తాయి.

ఒక్కసారి మీరు సిప్‌లో మదుపు చేయడం ప్రారంభిస్తే వీటిలో ప్రతీ నెలా కొంత పొదుపును పెట్టుబడిచేయడం ఒక అలవాటుగా మారిపోతుంది. 

పాపులర్ పెట్టుబడి సాధనం

ఇప్పుడు పలువురు ఇన్వెస్టర్లలో సిప్ పెట్టుబడి బాగా పాపులర్ అయ్యింది. మార్కెట్ల ఒడిదుడుకుల పట్ల, పెట్టుబడి చేసే సమయం పట్ల ఆందోళన లేకుండా క్రమశిక్షణతో పొదుపు చేసే అవకాశం సిప్‌లతో లభిస్తున్నది. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం పెట్టుబడుల ప్రపంచంలో ప్రవేశించడానికి ఉత్తమ సాధనం సిప్‌లేనని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు సూచిస్తుంటారు. 

ఇలా ప్రారంభించండి

మీరు ఎంతకా లంలో ఎంత నిధిని సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని నిర్ణయించు కున్నారో, ఆ మేరకు నిర్ణీత మొత్తాన్ని ప్రతీ నెలా మీరు ఎంచుకునే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో పెట్టుబడి చేయడం ఆరంభించాలి. అలా చేస్తానే మీ దీర్ఘకాలిక లక్ష్యం నెరవేరుతుంది. ఉదాహరణకు ప్రతీ నెలా మీరు రూ.1,000 సిప్‌లో పెట్టారనుకోండి.

ఆ పొదుపు దీర్ఘకాలంలో కోటి రూపాయిల నిధి చేతికొస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేసే సిప్ స్కీమ్‌ల్లో పెట్టుబడి చేసే సమయాన్ని (అంటే నెలవారీ లేదా త్రైమాసికోసారి) మీరే ఎంచుకోవచ్చు. రూ.500 కనిష్ఠ వాయిదా చెల్లింపును సైతం ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నది.

ఒకరకంగా చెప్పాలంటే ఇది బ్యాంక్‌లో వేసే రికరింగ్ డిపాజిట్ లాంటిదే. ప్రతీ నెలా లేదా ప్రతీ మూడు నెలలకు మీరే గుర్తుపెట్టుకుని చెల్లించే అవసరం లేకుండా, ఆటోమ్యాటిక్‌గా మీ బ్యాంక్ ఖాతా నుంచి చెల్లింపు జరిగే స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్‌ను కూడా మీ బ్యాంక్‌కు ఇవ్వవచ్చు.