calender_icon.png 16 January, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆచార్య నటేశ్వరశర్మ మృతి

11-09-2024 02:14:41 AM

  1. సంస్కృతాంధ్ర భాషల్లో 50కి పైగా రచనలతో సాహిత్యసేవ
  2. అంతర్యామి శీర్షికతో చేసిన రచనల ద్వారా ప్రత్యేక గుర్తింపు
  3. ఓయూలో ప్రాచ్యభాషా విభాగానికి డీన్‌గా సేవలు

కామారెడ్డి, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): సంస్కృతాంధ్ర భాషల్లో 50కి పైగా రచనలతో సాహిత్యానికి ఎనలేని సేవచేసి విద్వత్‌కవి, అష్టావధానిగా పేరుతెచ్చుకున్న డాక్టర్ ఆయాచితం నటేశ్వర శర్మ(68) అనారోగ్యంతో బాధపడుతూ.. మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈయన స్వగ్రామం కామారెడ్డి జిల్లా రామారెడ్డి. 1956, జూలై 17న జయలక్ష్మీదేవి, అనంతరాజశర్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. నటేశ్వర శర్మకు భార్య అరుణకుమారి (రిటైర్డ్ టీచర్), ముగ్గురు కుమార్తెలు సౌమిది, జాహ్నవి, యామిని ఉన్నారు.

1969లో సంస్కృత విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లోనే సంస్కృతం, తెలుగులో పద్య, గేయ రచనలను ప్రారంభించారు. ఈ రెండు భాషల్లో 50కి పైగా రచనలు చేశారు. కామారెడ్డిలోని ప్రాచ్య విద్యాపరిషత్, ప్రాచ్య కళాశాలలో ప్రిన్సిపల్‌గా కూడా విధులు నిర్వర్తించారు. 2011 నుంచి 2013 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రాచ్యభాష విభాగానికి పీఠాధిపతి (డీన్)గా సేవలు అందించారు. శర్మ సాహిత్య వ్యాసాలు, కవితలు, విమర్శలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అంతర్యామి శీర్షికతో ఈయన చేసిన రచనలు పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇటీవల ఆయన సాంస్కృత సంగీత రూపకం నాగిని పేరుతో ఆకాశవాణిలో ప్రసారమై రామప్ప దేవాలయ శిల్పకళా వైభవాన్ని చాటింది. అవధాని శశాంక, శతావధాని గుమ్మనగారి లక్ష్మీనర్సింహశర్మ అవధానాలతో స్ఫూర్తి పొందిన శర్మ.. డాక్టర్ రంగానాథ వాచస్పతితో కలిసి జెండా అవధానాలు చేశారు. ఈయన రాసిన సమయవిలాసిని, పంచషరియం, సౌదామిని విలాసం, చుక్కలు, చైత్రరథం, ఆటవెలది, జీవనయానం తదితర ఖండకావ్యాలు విశిష్ట రచనలుగా పేరుగాంచాయి.

తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని ప్రస్తుతిస్తూ సంస్కృతంలో రాసిన తెలంగాణ సుప్రభాతం.. తెలంగాణ మాసపత్రికలో ధారావా హికంగా ప్రచురితమై పాఠకులను ఆకట్టుకుంది. జిల్లాల విభజన తర్వాత 33 జిల్లాల ప్రత్యేకతలను తెలుపుతూ రాసిన పద్యాలు ఈయన విశిష్టతను చాటాయి. సంస్కృతాం ధ్రా భాషాల్లో శర్మ నూటికి పైగా అష్టావధానాలు చేశారు. అవధాన ప్రతిభకు తెలుగు విశ్వ విద్యాలయం ప్రతిభ పురస్కారం లభించింది. ఆది శంకరాచార్యులు రచించిన సౌందర్యలహరిపై పరిశోధనలకు గానూ 1994లో ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా, స్వర్ణపతకం అందుకున్నారు. ఆముక్తమాల్యదపై ఆయన విమర్శనా గ్రంథం ప్రామాణికమైంది. 

శర్మ పొందిన సత్కారాలు..

రంజని విశ్వనాథ పద్యకవిత పురస్కారం(2009), కిన్నెర ఆర్ట్ థియేటర్ వారి వచన కవితా పురస్కారం(2010), కిన్నె కందు వచన కవిత పురస్కారం(2011), రాష్ట్ర కవి ఔగేటి ధార్మిక సాహితి పురస్కారం(2012), సర్వ వైదిక సంస్థానం  విశిష్టకవి పురస్కారం(2013), శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ పద్యకవి పురస్కారం (2014), తేజ ఆర్ట్ క్రియేషన్స్ నుంచి విశిష్టకవి పురస్కారం (2014), విశ్వ సాహితి విశిష్ట సాహిత్య పురస్కారం (2014), భక్తి టీవి వారి ఆధ్యాత్మిక సేవా పురస్కారం(2014), తెలుగు విశ్వ విద్యాలయం నుంచి అవధాన ప్రతిభా పురస్కారం(2015), ఇందూరు అపురూప సాహితీ పురస్కారం (2016), వర్గల్ సరస్వతీ క్షేత్రం వారి అవధాన భారతి పురస్కారం పురస్కారం(2020), మల్లినాథసూరి కళాపీఠం వారి మహోపాధ్యాయ పురస్కారం(2021), డీవీఎల్‌ఎన్ శాస్త్రి స్మారక సాహితీ పురస్కారం(2021), కోటంరాజు స్మారక సాహితీ పురస్కారం(2021) లాంటి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం 2023లో ప్రతిష్ఠాత్మక దాశరథి పురస్కారంతో ఆయాచితం నటేశ్వర శర్మను ఘనంగా సన్మానించింది. బుధవారం 12 గంటలకు హైదరాబాద్‌లోని కొంపల్లిలో అంత్యక్రియలు జరుపతామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.