calender_icon.png 28 September, 2024 | 2:42 PM

వెల్ది కవితకు 'ఆచార్య' స్మారక పురస్కారం

28-09-2024 11:09:58 AM

ప్రభుత్వ లాంచనాలతో అమాత్యుల చేతుల మీదుగా ప్రధానోత్సవం..

హర్షం వ్యక్తం రామగుండం పద్మశాలీలు...

రామగుండం (విజయక్రాంతి): అభయ చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్, అఖిల భారత పద్మశాలి మహిళా విభాగం తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ వెల్ది కవితకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో ఆమెకు ఆచార్య లక్ష్మణ్ బాపూజీ  పురస్కారం లభించింది. ఈ మేరకు వెనకబడిన  తరగతుల సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్రభారతిలో  శుక్రవారం స్వాతంత్య్ర సమరయోధులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతి పురస్కరించుకొని అధికారికంగా నిర్వహించిన ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం మేరకు వెల్ది కవిత హాజరు కాగా, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం  ప్రభాకర్ గౌడ్, అనసూయ (సీతక్క), వరంగల్ మేయర్ గుండు సుధారాణి, అఖిల భారత పద్మశాలి మహిళా అధ్యక్షురాలు వనం దుశ్శాంతల తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం రాష్ట్రవ్యాప్తంగా కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను పునికి పుచ్చుకొని సమాజ ఉద్ధరణ కోసం పాటుపడుతున్న పలువురిని గుర్తించి స్మారక పురస్కారాలతో సత్కరించారు. దీనిలో భాగంగా పెద్దపల్లి జిల్లా నుంచి రామగుండం పారిశ్రామిక ప్రాంతమైన యైటింక్లెయిన్ కాలని కి చెందిన అభయ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ వెల్ది కవిత అనంతరాములకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక అవార్డు ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పద్మశాలీల ఐక్యతకు , ఉన్నతికి పాటుపడతానని, కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి రోజున  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనను సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కాగా, పెద్దపల్లి జిల్లా నుంచి బాపూజీ స్మారక పురస్కారం అందుకోవడం గర్వించదగ్గ విషయమని రామగుండం ప్రాంతా పద్మశాలీలు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు.