ట్రైనీ డాక్టర్ హత్య కేసులో పోలీస్ వలంటీర్ అరెస్ట్
సీసీటీవీ ఆధారంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఘటనకు ముందు ఆమె ఉన్న గదిలోకి వెళ్లిన సంజయ్‌రాయ్
కాలేజీ సూపరింటెండెంట్‌పైనా ప్రభుత్వం వేటు
బాధితులను కఠినంగా శిక్షించాలని వైద్యుల డిమాండ్
కోల్‌కతా, ఆగస్టు 11: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో పోలీస్ వలంటీర్ సంజయ్ రాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును స్వీకరించిన 6 గంటల్లోనే సిట్ శుక్రవారం అర్ధరాత్రి అనుమానితుడిని అరెస్ట్ చేసింది. సీసీటీవీ ఫుటేజీతో పాటు పగిలిపోయిన ఇయర్‌ఫోన్ ఆధారంగా సంజయ్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సీసీటీవీ దృశ్యాల్లో ఇయర్‌ఫోన్‌ను మెడలో వేసుకుని సంజయ్ సెమినార్ గదిలోకి ప్రవేశించడం రికార్డయింది. 40 నిమిషాల తర్వాత అతను ఆ గది నుంచి బయటకు వస్తుండగా ఇయర్‌ఫోన్ కనిపించలేదు.
వైద్యురాలి మృతదేహం కనిపిం చిన సెమినార్ గదిలోనే ఇయర్‌ఫోన్ దొరకడం, తర్వాత పోలీసులు ప్రయత్నించి నప్పుడు అది సంజయ్ ఫోన్‌కు కనెక్ట్ కావడంతో వెంటనే సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో హాజరు పరచగా ఆగస్టు 23 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా పోటీని చూస్తూ బాధితురాలు సహా మరో నలుగురు విద్యార్థులు సెమినార్ హాల్‌లో భోజనం చేశారు. అనంతరం వారు వెళ్లిపోవడంతో ఆమె అక్కడే చదువుతూ ఉండిపోయి ంది. ఉదయం 4 గంటలకు సంజయ్ ఆ గదిలోకి ప్రవేశించాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించగా గొంతు నులిమి చంపేశాడు. ఈ సమయంలోనే అతని ఇయర్‌ఫోన్ ధ్వంసమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని ఉదయం 7.30 గంటలకు గుర్తించారు. పోస్టుమార్టం నివేదిక కూడా బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా వైద్యసేవలు బంద్
ఈ ఘటనతో ఆర్జీ కర్ కాలేజీ సూపరింటెండెంట్‌పై ప్రభుత్వం వేటు వేసింది. అతని స్థానంలో ఆసుపత్రి డీన్ బుల్బుల్ ముఖోపాధ్యాయను నియమించారు. పీజీ వైద్య విద్యార్థినిపై దారుణ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ ఘటనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నేడు కొన్ని రకాల వైద్య సేవలు నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. హత్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది.