- 16 లక్షల నగదు, ఇన్నోవా, బైక్ స్వాధీనం
- కేసు వివరాలు వెల్లడించిన డీసీపీ శ్రీనివాస్
రాజేంద్రనగర్, ఆగస్టు 1: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో గత నెల 21న ప్రగతి ట్రేడర్స్‌లో జరిగిన రూ.50 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.16 లక్షల నగదు, ఓ ఇన్నోవాతో పాటు బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ గురువారం మీడియాకు వెల్లడించారు. 9 మందితో కూడిన ఓ గ్యాంగ్ కాటేదాన్‌లోని పారిశ్రామికవాడలో పనిచేస్తున్న మరో ఇద్దరిని తమతో కలుపుకొన్నారు. ఆయా కంపెనీల్లో ఏయే సమయాల్లో ఎక్కువ డబ్బు వస్తుందనే విషయాన్ని చోరీ కంటే ముందు రెండు నెలలపాటు పక్కాగా రెక్కీ నిర్వహించారు.
ఈ క్రమంలో ఈ గ్యాంగ్ గత నెల 21న తెల్లవారుజామున ప్రగతి ట్రేడర్స్ బ్యాటరీ కంపెనీలో యజమాని బీరువాలో దాచి ఉంచిన రూ.50 లక్షల నగదును బీరువా ధ్వంసం చేసి అపహరించుకుపోయారు. ఈ మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సైబరాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్ సీసీఎస్ పోలీసులతో కలిసి దర్యాప్తు చేశారు. బుధవారం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మిగతా ఏడుగురిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని డీసీపీ తెలిపారు. కాగా, ఈ గ్యాంగ్ గతంలో అత్తాపూర్‌లో జరిగిన ఓ చోరీ కేసులో కూడా నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. నిందితులు ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌లో ఇన్నోవా అద్దెకు తీసుకొని దాని నంబర్ ప్లేటు మార్చినట్లు డీసీపీ తెలిపారు.