calender_icon.png 7 November, 2024 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడు అరెస్టు

15-08-2024 01:47:04 AM

అతడికి సహకరించిన మరో నలుగురిపై కేసు నమోదు

రాజేంద్రనగర్, ఆగస్టు 14: గిరిజన బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసి గుట్టుగా అబార్షన్ జరిపించిన వ్యవహారంలో శంషాబాద్ మండలంలోని జూకల్ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డితో పాటు అతడికి సహకరించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ నరేందర్‌రెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. జూకల్ సమీపంలోని ఓ తండాకు చెందిన బాలిక తన తల్లితో కలిసి కృష్ణారెడ్డి పొలంలో కూలీ పనులకు వెళ్లేది. ఈ క్రమంలోనే కృష్ణారెడ్డి బాలికకు మాయమాటలు చెప్పి కొన్ని నెలలుగా లైంగిక దాడికి పాల్పడడంతో గర్భం దాల్చింది.

కృష్ణారెడ్డి ఈ విషయాన్ని తన ఇద్దరు సోదరులకు చెప్పాడు. వారితో కలిసి కొత్తూరులోని ఓ ఆసుపత్రికి బాలికను తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. ఈ నేపథ్యంలో నిందితుడు విషయం బయటకు పొక్కకుండా బాలిక తల్లిదండ్రులతో పాటు గ్రామపెద్దలతో బేరసారాలు నిర్వహించగా, బాలిక తల్లిదండ్రులు వినలేదు. ఈ మేరకు మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు కృష్ణారెడ్డిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ తెలియజేశారు. అతడిపై పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అతడికి సహకరించిన సోదరులతో పాటు ఇద్దరు డాక్టర్లపై కేసు నమోదు చేశామన్నారు. వారిని అరెస్టు చేస్తామని వెల్లడించారు.