calender_icon.png 15 November, 2024 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదిపై దాడి ఘటనలో నిందితుల అరెస్ట్

14-11-2024 01:14:48 AM

దాడికి పాల్పడింది మైనర్లు!

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి): నగరంలోని ఐమాక్స్ వద్ద మంగళవారం న్యాయవాది కల్యాణ్‌పై దాడి చేసి మొబైల్ ఎత్తుకెళ్లిన కేసును సెంట్రల్ జోన్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. బుధవారం అబిడ్స్ పీఎస్‌లో అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, సైఫాబాద్ ఏసీపీ సంజయ్ వివరాలు వెల్లడించారు.

మంగళవారం తెల్లవారుజామున అబిడ్స్ పీఎస్ పరిధి గన్‌ఫౌండ్రీలోని ప్రసాద్ అపార్ట్‌మెంట్స్ వద్ద వాచ్‌మెన్‌ను దుండగులు కత్తితో బెదిరించి సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత ఐమాక్స్ వద్దకు వెళ్లి వాకింగ్ చేస్తున్న న్యాయవాది కల్యాణ్ వద్ద ఉన్న ఫోన్‌ను సైతం ఎత్తుకెళ్లేందుకు యత్నిం చగా కల్యాణ్ ప్రతిఘటించడంతో కత్తితో బెదిరించారు.

ఈ క్రమంలో కల్యాణ్‌కు గాయాలయ్యాయి. సెంట్ర ల్ జోన్ పరిధిలో రెండు ఇదే తరహా కేసులు నమోదు కావడంతో డీసీపీ యాదవ్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా రాంనగర్ ఫిష్ మార్కెట్ వద్ద ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి వాచ్‌మెన్ ఫోన్‌ను రికవరీ చేశారు.

నిందితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా చాంద్రాయణగుట్ట బండ్లగూడకు చెందిన మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి న్యాయవాది కల్యాణ్ సెల్‌ఫో న్‌తో పాటు దాడికి ఉపయోగించిన కత్తి, వారు వినియోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులిద్దరూ మైనర్లుగా తేలిందని, వారి వయస్సు నిర్ధారించేందుకు ఉస్మానియా ఆసుపత్రికి టెస్టులకు పంపిం చామని చెప్పారు. గతంలో వీరిపై ఇదే తరహాలో ముషీరాబాద్ పీఎస్‌లో సెల్‌ఫోన్ స్నాచింగ్ కేసు నమోదైందని ఏసీపీ చంద్రశేఖర్ వెల్లడించారు.