సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికావని మాజీ మంత్రి హరీశ్‌రావు ఖండించారు. బుధవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ కరెంటు కోతల విషయంలో తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై అభాండాలు మోపడంపై తీవ్రంగా మండిపడ్డారు. విద్యుత్ రంగంపై వైఫల్యాలకు తానే బాధ్యడునని అన్నట్లుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఆయన వైఖరి ఆడలేక మద్దెల ఓడు అనే సామెత గుర్తుకువస్తుందన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించిందన్నారు. రెప్పపాటు కాలం కూడా కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. కేవలం ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను కూప్పకూల్చిందని ఆరోపించారు. గృహ, వ్యవసాయ పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను చీటికిమాటికి నిందించడం, చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థుర్యైన్ని దెబ్బతీయడమేనన్నారు. విద్యుత్ ఉద్యోగులపై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం ఇలాంటి చిల్లర చేష్టలు మాని కేసీఆర్ హయాంలో 24 గంటల కరెంటు ఇచ్చినట్లుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిదని సూచించారు. తనలాగే అందరూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడతున్నారని సీఎం భ్రమల్లో ఉన్నారని, వాటిని వీడిన పాలనపై సక్రమంగా దృష్టి పెడితే మంచిదని హితువు పలికారు.