calender_icon.png 28 September, 2024 | 10:58 AM

ఎస్పీ ఆఫీసులో మెడికోలకు వసతి

27-09-2024 12:06:06 AM

రూ.39 లక్షలతో వసతుల కల్పన

కుమ్రంభీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ మెడికల్ కళాశాల విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. ప్రస్తుతం మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పాత ఎస్పీ కార్యాలయంలోని పాత డీఆర్డీఏ కార్యా లయంలో వసతిని ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం పూర్తవడంతో మరో వంద సీట్లు పెరిగిన నేపథ్యంలో విద్యార్థినుల కోసం మెడికల్ కళాశాలపై ఉన్న రెండతస్తులలో వసతిని ఏర్పాటు చేసేందుకు అధికా రులు చర్యలు చేపట్టారు.

మౌలిక వసతుల కల్పనకు రూ.39 లక్షల వెచ్చించనున్నట్లు ప్రిన్సిపాల్ పా లోజు సతీష్‌కుమార్ తెలిపారు. మెడికల్ కళాశాల పూర్తి స్థాయిలో ఏర్పా టు కాకముందే క్లాసులు ప్రారంభించడంతో మొదటి సంవత్సరం విద్యార్థులు సమస్యల నడుమ విద్యనభ్యసించారు. కళాశాలకు, వారు ఉంటున్న భవనాలకు దాదాపు ఐదు కిలో మీటర్ల దూరం ఉండటం తో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్‌కు విద్యార్థులు విన్నవించడంతో కళాశాల వద్ద విద్యార్థినుల కోసం వసతి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం 55 మంది విద్యార్థినులు, 44 మంది విద్యార్థులు ఉన్నారు. మొదటి ఏడాది సీట్ల కేటాయింపు తర్వాత ప్రస్తుతం కొనసాగుతున్న వసతి గృహాలను పురుషులకు కేటాయించనున్నారు. 

ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 88.8 శాతం ఉత్తీర్ణత

ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ఫరీక్షా ఫలితాలు మెడికల్ బోర్డు గురువారం విడుదల చేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ మెడికల్ కళాశాల మొదటి సంవత్సరంలో 99 మంది పరీక్షలు రాయగా ఇందులో ఇద్దరు డిస్టిక్షన్ సాధించగా ఫస్ట్ క్లాసులో 25 మంది, సెకండ్ క్లాస్‌లో 61 మంది ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ పాలోజు సతీష్‌కుమార్ తెలిపారు. మొత్తంగా 88.8శాతం ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు.