calender_icon.png 20 November, 2024 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదాలకు మూలం నిర్లక్ష్యమే

17-11-2024 12:00:00 AM

-కావలి చెన్నయ్య ముదిరాజ్


బ్రిటన్ దేశస్థురాలు బ్రిగెట్టె చౌదరి తన కుమారుడు 1990 లో మరణించడంతో కలత చెంది 1991లో రహదారి ప్రమాద బాధితుల కోసం మొదటి సారి సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. తర్వాత1992లో రోడ్ పీస్ (రహదారి శాంతి) అనే స్వచ్ఛంద సంస్థను నమోదు చేయించారు. 1993లో బ్రిటీష్ రోడ్ క్రాష్ బాధితులు అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి రహదారి బాధితుల సంస్మరణ సభను నిర్వహించారు. 2003లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) రోడ్ పీస్ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలకు మద్దతును ప్రకటించగా,  2005లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. అప్పటినుండి ప్రతి సం వత్సరం నవంబర్‌లో మూడవ ఆదివారం నాడు రోడ్డు ట్రాఫిక్ బాధితుల జ్ఞాపకార్థం ప్రపంచ దినోత్సవం నిర్వహిస్తున్నారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకా రం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సుమారుగా 13,50,000 రహదారి ప్రమాదాల వల్ల మరణిస్తున్నారు. ఇంచుమించు 2-5 కోట్ల మంది గాయాల పాలవుతున్నారు.  ప్రమాదాల బారిన పడుతున్న వారి వయస్సు 18-59 సంవత్సరాలుగా ఉండడం గమనార్హం. రహదారి ప్రమాదాలు ఎక్కువగా అల్ప ,మధ్య  ఆదాయ వర్గ దేశాలలో జరుగుతున్నాయి అంటే అవగాహన రాహిత్యం, నిర్లక్ష్యమే కారణం. మొత్తం ప్రపంచ వాహనాలలో 60 శాతం ఇక్కడే ఉన్నాయి అంటే వీరు ప్రజా రవాణాను చాలా తక్కువగా వినియోగిస్తారని అర్థం.

భారత్‌లో రోజుకు 474 మంది

భారతదేశ విషయానికి వస్తే కేంద్ర రహదారి రవాణా శాఖ నివేదిక 2023 ప్రకారం 5లక్షల రహదారి ప్రమాదాల వల్ల సుమారు 1,73,000 మరణించారు. సగటున రోజుకు 474 మంది అంటే గంటకు 19.75 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే మృతుల సంఖ్య 4 శాతం ఎక్కువ. గంటకు జరిగే 53 ప్రమాదాలకు గాను క్షతగాత్రులైన వారు దాదాపు 4,63,000 మంది.  నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో  నివేదిక 2022 ప్రకారం  రోడ్డు ప్రమాద మృతుల్లో యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

కేంద్ర రవా ణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పేంతవరకు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మనదేశంలో సామాన్య ప్రజానీకం ప్రకృతి వైపరీత్యా లు, అల్లర్లు, యుద్ధాలు, ఉగ్రవాదుల దాడులు అధిక ప్రాణ నష్టం కలిగిస్తున్నాయని అనుకునే వారు. కాని రోడ్డు ప్రమా దాల వల్లనేనని తెలియదు. 2012లో దేశంలోని వాహనాల సంఖ్య 15 కోట్ల 90 లక్షలు. అదే 2024 వచ్చేసరికి 38 కోట్ల 3 లక్షల వాహనాలు అంటే 12 సంవత్సరాల్లో దాదాపు రెట్టింపు అయ్యాయి.

నేడు వాహనం లేకుండా మానవ దైనందిన జీవితం నడవడం అసాధ్యం.  ప్రతి పనికి వివిధ రకాల వాహనాల మీద ఆధారపడుతున్నాడు. వాహనా లను వాడి తన పనులను సులువుగా చేసుకోవడంలో తప్పులేదు కానీ మనలో చాలామందికి వాహనాలను సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలియట్లేదు. దీనివల్ల ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. ఫలితంగా ్రఎక్కువ  ప్రాణ నష్టం జరుగుతోంది.

ఇటీవల  ఢిల్లీలోని ఫెడరేషన్ హౌస్‌లో ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నిర్వహించిన రోడ్ సేఫ్టీ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  మాట్లాడుతూ బ్లాక్ స్పాట్ల( ప్రమాద కేంద్రీకృత ప్రదేశం) సంఖ్య నిరంతరం పెరగడా నికి రహదారి ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సరిగా లేకపోవడమే కారణమని  పేర్కొన్నారు. దాదాపు అన్ని ప్రమా దాలకు డ్రైవర్లు కారణం అయినా కానీ రహదారి నిర్మాణ సాంకేతికతలో కూడా లోపం ఉందంటూ దేశంలోని అన్ని రహదారులపై సేఫ్టీ ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు.

2025 నుంచి అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు కలిగిన బస్సులను మాత్రమే విక్రయించడానికి అనుమతిస్తామని చెప్పా రు. రహదారి భద్రత అంటే రోడ్డు భద్రతా నియమాలు, నిబంధనలను తు.చ తప్పకుండా పాటించడం ద్వారా రహదారి ప్రమాదాలను నివారించడం. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం రహదారి భద్రతలో అతి ముఖ్యమైన అంశం. రహదారి ప్రమాదాల ను నివారించడానికి మెరుగైన రహదారు లను అభివృద్ధి చేయడం కూడా చాలా ము ఖ్యం. వేగంగా వెళ్లే వాహనాలతో ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది.

 రహదారి ప్రమాదాలకు కారణాలు

 ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫి క్ నిబంధనలు పాటించని జనం వైఖరి. ఇవి కాకుండా అతివేగం, తాగి వాహనాన్ని నడపడం, హెల్మెట్,  సీట్ బెల్ట్ ధరించకపో వడం, మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ వాహనాన్ని నడపడం,ట్రాఫిక్ సిగ్నల్స్‌కోసం వేచి ఉండకుండా దురుసుగా వాహనాన్ని నడపడం లాంటివి కూడా వీటికి తోడవుతున్నాయి.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో2021 డేటా ప్రకారం , డ్రగ్స్ లేదామద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల 1.9శాతం ప్రమాదాల మరణాలు సంభవించాయి.

రహదారిపై దాదా పు 90శాతం మరణాలు అతివేగం, ఓవర్‌టేకింగ్,ప్రమాదకరమైన డ్రైవింగ్ కారణంగా సంభవించాయి. ప్రపం చ బ్యాంకు 2019 గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో టాప్ 20 దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. కార ణాలు పరిశీలించినట్లయితే మౌలిక సదుపాయాల లోపాలు,- రోడ్లు, వాహనాల దయ నీయ పరిస్థితులు, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, అలసట,   వంటి వాటిని గుర్తించడారు.- 2014లో, గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కొన్ని కారు మోడళ్లు ఐక్యరాజ్యసమితి యొక్క ఫ్రంటల్ ఇంపాక్ట్ క్రాష్ టెస్ట్‌లో విఫలమయ్యాయి.

5 శాతం దాకా జీడీపీ నష్టం

ప్రపంచ బ్యాంకు ప్రకారం, రోడ్డు ప్రమాదాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ప్రతి సంవత్సరం జీడీపీలో 3 నుండి 5 శాతం నష్టపోతోంది. ప్రతి రోడ్డు ప్రమాద మర ణం వలన పేద కుటుంబాలలో దాదాపు ఏడు నెలల కుటుంబ ఆదాయం క్షీణిస్తుం ది. బాధిత కుటుంబాలను పేదరికం, అప్పు ల్లోకి నెట్టివేస్తుంది. కుటుంబాన్ని పోషించే మగవారు ప్రాణాలు కోల్పోతే ఇల్లాలు కుటుంబ భారం మోయలేక చాలా సమస్యలు వస్తున్నాయి. ఇది మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ప్రమాదం తర్వాత మహిళల పని తీరులో, జీవన శైలిలో చాలా మార్పులు వచ్చినట్లు ఈ నివేదిక తెలిపింది ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మరణాలకు కారణాలలో రోడ్డు ప్రమాదాలది 8వ స్థానం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018లో విడుదల చేసిన నివేదిక తెలిపింది. 

ప్రమాద నివారణ

వాహనాన్ని నడిపే వారే కాకుండా రహదారిపై ప్రయాణిస్తున్న ప్రజలు కూడా ప్రమాదాల పట్ల చైతన్యవంతులై ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నాణ్యమైన, తీవ్రమైన మలుపులు లేకుం డా రహదారులను నిర్మించాలి. స్పీడ్ డిటెక్షన్ పరికరాలు అవసరమైన ప్రతి చోట్ల రహదారిపై అమర్చాలి.  వాహన వేగాన్ని అంచనా వేయడానికి ట్రాఫిక్ పోలీసులు ఉపయోగించే పరికరాలను వారికి అందజేయాలి.

కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంతో ట్రాఫిక్ చట్టాలను సరిగా అమలు చేయా లి. ప్రమాద కారకులు ఎంతటి వారైనా పక్షపాత ధోరణి లేకుండా చట్టపరంగా శిక్షలు అమలు చేయాలి. ముఖ్యంగా ప్రమాదం తర్వాత అంగ వైకల్యానికి గురయ్యేవారి సంఖ్య నగరాలలో కంటే గ్రామీణ ప్రాంతాలలో రెండింతలు ఎక్కువగా ఉంటోందని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ట్రాఫిక్ క్రాష్ ఇంజ్యూరీస్ అండ్ డిసెబిలిటీస్,ది బర్డెన్ ఆన్ ఇండియన్ సొసైటీ అనే నివేదిక పేర్కొంది.

రహదారి ప్రమాదాలలో మన దేశం అగ్ర స్థానంలో ఉంది. ప్రపంచంలో ఉన్న వాహనాలలో 1 శాతం వాహనాలు మాత్రమే దేశంలో ఉండగా, రోడ్డు ప్రమాదాలు మాత్రం 11 శాతం నమోదు అవుతున్నాయి అంటే వాహనం నడపడంలో కానీ  నిబంధనలు పాటించడంలో కానీ భారతీయ ప్రజలు మరింత చైతన్యవంతులు కావలసి ఉంది అప్పుడే రహ దారి ప్రమాదాల నివారణ సాధ్యపడుతుంది. ముఖ్యంగా ప్రతి పౌరుడు ప్రయా ణంలో జాగ్రత్తగా ఉండాలి.

- వ్యాసకర్త సెల్: 9000481768