జడ్చర్ల: నవాబుపేట మండల పరిధిలోని పోమాల్ పెద్ద చెరువులో శనివారం బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి తల్లి ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. గ్రామానికి చెందిన కుక్కింద సరోజ (25) తనకు నలుగురు సంతానంలో ముగ్గురు పిల్లలను వెంట తీసుకొని చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్ళింది. ఆమె బట్టలు ఉతుకుతుండగా ఆమె వెంట వెళ్లిన చిన్నారులలో మిల్కీ, తేజ, కన్న అనే ముగ్గురు చెరువులోకి జారిపోయారు.
అది గమనించిన సరోజ వారిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తూ అందులోనే మునిగిపోయింది. అందులో తేజ నీటి నుండి బయటపడగా అందులో తల్లి సరోజ, మిల్కీ, కన్న నీటిలో మునిగి మృతి చెందారు. సంఘటన జరగడం గమనించిన గ్రామస్తులు వెంటనే చెరువులోకి దూకి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. ఒకే రోజు ఒకే సంఘటనలో ముగ్గురు మృత్యువాత పడడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.