మునుగోడు (విజయక్రాంతి): మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి వాగులో పడి మృతి చెందిన సంఘటన మండలంలోని చోల్లేడు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన దోటి సత్తయ్య, తండ్రి ఎల్లయ్య, 31 సం.లు చిన్నప్పటి నుండి మతిస్థిమితం కోల్పోయి ఊరిలో తిరుగుతూ రెండు మూడు రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. అదే మాదిరిగా గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఇంటి నుండి వెళ్ళిపోయి తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం సమయంలో వంగూరి శంకరయ్య అనే వ్యక్తి సదరు దోటి సత్తయ్య గ్రామ శివారులోని పెద్దమ్మ గుడి సమీపంలో చోల్లేడు కల్వకుంట్ల వాగులో చనిపోయి ఉండగా చూసి, మృతుని అన్న నర్సింహాకు సమాచారం అందించగా తక్షణమే ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. సత్తయ్య ప్రమాదవషత్తు వాగులో పడి చనిపోయినట్లు ఫిర్యాదు చేయగా ఎస్సై ఇరుగు రవి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.