calender_icon.png 16 October, 2024 | 7:00 PM

ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలి...

16-10-2024 04:22:38 PM

సిసిటీవీ కెమెరాలు ఏర్పాటును ప్రోత్సహించాలి..

డిఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ...

ఆదిలాబాద్, (విజయక్రాంతి): గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలను పెంచుకోవాలని, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా ప్రజలను ప్రోత్సహించాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పోలీస్ లకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్ డిఎస్పీ కార్యాలయాన్ని బుధవారం ఎస్పీ తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి సాయుధ బలగాలతో కూడిన బృందం గౌరవ వందనాలు అందించి, డీఎస్పీ జీవన్ రెడ్డి పుష్పగుచ్చం అందించి సాదరంగా ఆహ్వానించారు. ఎస్పీ కార్యాలయ పరిసరాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఆదిలాబాద్ లోని పోలీస్ స్టేషన్ లకు వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదుదారు పిటిషన్ వెంటనే నమోదు చేసి సంబంధిత అధికారులకు అప్పగించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి ఎటువంటి పెండెన్సీ లేకుండా చూడాలని తెలిపారు.

సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించినప్పుడే ప్రజలలో పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందని తెలిపారు. రాత్రి సమయాలలో అదనంగా గస్తీ నిర్వహిస్తూ ఆర్థిక నేరాలను కట్టడి చేసే విధంగా ప్రణాళికను రూపొందించి అవలంబించాలని సూచించారు. సిబ్బంది ఎల్లవేళలా పోలీస్ స్టేషన్ లో అప్రమత్తంగా ఉండి ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా అందుబాటులో ఉండాలన్నారు. 5ఎస్ విధానాన్ని అమలు చేస్తూ రికార్డుల నిర్వహణను చేపట్టాలని సూచించారు. సిబ్బంది విధులను పర్యవేక్షిస్తూ ఎలాంటి లోపాలను లేకుండా సరిచూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు కరుణాకర్, సునీల్, శ్రీనివాస్, నవీన్ డీఎస్పీ కార్యాలయ సిబ్బంది జైపాల్, రవి పాల్గోన్నారు.