- డబుల్ బెడ్రూం ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు
- జనగామ జిల్లా తొర్రూరు(జె)లో ఘటన
జనగామ, సెప్టెంబర్ 25(విజయక్రాంతి): డబుల్ బెడ్రూం నిర్మాణాలు పూర్తి చేసి కేటాయించడంలో జాప్యం చేస్తుండటంతో పలువురు గృహ ప్రవేశం చేశారు. వారిని అధికారులు బలవంతంగా ఇండ్లు ఖాళీ చేయించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు(జె) గ్రామంలో బీఆర్‌ఎస్ హయాంలో 20 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేశారు.
కానీ వాటిని ఎవరికీ కేటాయించలేదు. కొన్ని నెలల క్రితం ఆ ఇండ్లలోకి కొందరు గ్రామస్థులు తమకు తామే గృహప్రవేశం చేశారు. దౌర్జన్యంగా ఇండ్లలో ఉండటం సరికాదని పలుమార్లు అధికారులు వారికి వివరించారు. గతంలో ఓసారి ఇండ్లను ఖాళీ చేయించారు. అయినా కొందరు మళ్లీ ఆ ఇండ్లలోనే ఉంటున్నారు.
దీంతో అనర్హులు డబుల్ బెడ్రూం ఇండ్లలో ఉంటున్నారని పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బుధవారం రెవెన్యూ సిబ్బంది డబుల్ బెడ్రూం ఇండ్ల వద్దకు చేరుకుని అందులో నివాసముంటున్న వారిని ఖాళీ చేయించారు. సామన్లను బయట పడేసి ఇంట్లో ఉంటున్న వారిని బయటికి పంపించారు.
ఈ క్రమంలో కొందరు చనిపోతామంటూ పెట్రోల్ బాటిళ్లతో హల్‌చల్ చేశారు. ఓ మహిళ కొంత పెట్రోల్ నోట్లో పోసుకోగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయినా కూడా అధికారులు 20 ఇండ్లను ఖాళీ చేయించి సీజ్ చేశారు.