హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. శనివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని ఉద్యానవన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ దేశానికి రైతు వెన్నెముక లాంటి వాడని, వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకాలిస్తే పెద్దఎత్తున పంట దిగుబడి వస్తుందన్నారు.
తనకు సలహాదారు పదవి ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి తనవంతుగా సలహాలు, సూచనలు ఇస్తానని చెప్పారు. కాంగ్రెస్ రైతు పక్షపాతి ప్రభుత్వమని, దేశంలో ఎక్కడలేని విధంగా రైతులకు రూ. 2 లక్షల పంట రుణమాఫీ చేసి చరిత్రలో నిలిచిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలను అన్నదాతల సంక్షేమం కోసం ప్రవేశపెడుతామని వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాస్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పోచారం బాధ్యతల స్వీకరణ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులతో పాటు వివిధ జిల్లాలకు చెందిన రైతు నాయకులు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు.