ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్ లిస్ట్ అంతా తప్పుల తడక...
అర్హులైన చాలామందికి ఇండ్లు కేటాయించలేదు...
అశ్వాపురం బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు గద్దల రామకృష్ణ
బూర్గంపాడు (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా పాలన పేరిట స్వీకరించిన దరఖాస్తులు ఏమయ్యాయని.. ఇటీవల కుల గణన సర్వే పేరిట స్వీకరించిన డేటా ఏమైందని.. ఏడాదికాలంగా ఎన్ని ప్రజాపాలన అప్లికేషన్లు పరిష్కరించారో చెప్పకుండా మళ్లీ ప్రజా పాలన దరఖాస్తుల పేరిట గ్రామ సభలు నిర్వహించి ఏం చేస్తారని అశ్వాపురం బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు గద్దల రామకృష్ణ ప్రశ్నించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలంగా వివిధ పథకాలకు దరఖాస్తులు స్వీకరించడం, అర్హులను, లబ్ధిదారులను సంబంధిత కార్యాలయాల చుట్టూ తిప్పిస్తూ జనాలతో ఆటలాడుకుంటుందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజాపాలన పేరిట దరఖాస్తులను స్వీకరించి వాటిలో ఏ ఒక్కరి అప్లికేషన్ అయిన పరిష్కరించకుండా అటకెక్కించిందన్నారు.
మళ్లీ కుల గణన సర్వే పేరిట కుటుంబ పూర్తి డేటాను సేకరించి, ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన వారికి రేషన్ కార్డులను ఇచ్చిందని ఆయన ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ సర్కార్ రైతు రుణమాఫీ కొందరికే చేసి, రుణమాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో తిరిగేలా చేసిందని, సంబంధిత వివరాలతో అప్లికేషన్ లు తీసుకొని నేటికీ అనేకమంది రైతులకు రుణమాఫీ చేయకుండా గోసపెడుతుందన్నారు. దరఖాస్తులు, ప్రజల డేటాను స్వీకరించి కాంగ్రెస్ ఏడాది కాలంలో సాధించిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే బాహాటంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు, శ్రేయోభిలాషులకే పథకాలు ఇస్తామని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నప్పుడు దరఖాస్తుల స్వీకరణ ఎందుకని ఆయన ప్రశ్నించారు. అసలైన అర్హులకు, లబ్ధిదారులకు న్యాయం చేయకుండా వాళ్లను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం సమంజసం కాదన్నారు.
ప్రస్తుతం ప్రజా పాలన పేరిట ఏర్పాటుచేసిన గ్రామసభల్లో గతంలో ఎంతమంది వివిధ పథకాల కోసం ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్నారో వారి పేర్లను కూడా గ్రామ వార్డు సభల్లో అధికారులు చదవాలన్నారు. మళ్లీ ప్రజాపాలన కొత్త దరఖాస్తులు ఎందుకో కూడా చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారులు వీటికి సమాధానం చెప్పకుండా కేవలం దరఖాస్తులు స్వీకరించే ప్రయత్నం చేస్తుందని, ఇది కేవలం రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న నయా డ్రామా మాత్రమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంగా ప్రజల సమస్యలను పరిష్కరించకుండా దరఖాస్తుల స్వీకరంతో టైంపాస్ పాలన కొనసాగిస్తుందని ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా విమర్శించారు.