calender_icon.png 4 February, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

03-02-2025 10:33:36 PM

గ్రాడ్యుయేట్ స్థానానికి ఆరుగురు..

టీచర్స్ స్థానానికి ముగ్గురు.. 

మొత్తం 13 సెట్ల నామినేషన్లు దాఖలు 

నామినేషన్లు స్వీకరించిన జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి..

నిజామాబాద్ (విజయక్రాంతి): మెదక్ నిజామాబాద్ కరీంనగర్ అదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం సోమవారం ప్రారంభమైంది. కరీంనగర్ కలెక్టరేట్లో ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 9 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి ఆరుగురు, టీచర్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో ఇద్దరు అభ్యర్థులు గ్రాడ్యుయేట్, టీచర్స్ స్థానానికి రెండిట్లోనూ నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 13సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్లో నామినేషన్లను స్వీకరించారు. 

సోమవారం నాడు రిటర్నింగ్ ఆఫీసర్,  కలెక్టర్ నామినేషన్ల స్వీకరణ అనంతరం మాట్లాడుతూ గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాను రిటర్నింగ్ అధికారిగా, వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ నెల 3 నుండి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. 8, 9 తేదీల్లో ప్రభుత్వ సెలవులు ఉండడం వల్ల నామినేషన్లు స్వీకరణ జరగదని, ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఈనెల 11న నామినేషన్ల పరిశీలన,13 న  నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంటుందని పేర్కొన్నారు.

మార్చి 3 న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సందేహాలను నివృత్తి చేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హెల్ప్ డేస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. అభ్యర్థులు రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి తూ.చ తప్పకుండా పాటించాలని ,ర్యాలీలు, సమావేశాలు, సభలు తదితర వాటికి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆమె కోరారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు  తగిన సూచనలు, సలహాలు అందించేందుకు అధికారులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు.

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి..

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సిలివేరు శ్రీకాంత్ అనే అభ్యర్థి ఇటు గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు రెండు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన దూడ మహిపాల్, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడెంకు చెందిన గవ్వల లక్ష్మి, మేడ్చల్ కు చెందిన కంటే సాయన్న గ్రాడ్యుయేట్ స్థానానికి ఒక్కొక్క సెట్ నామినేషన్ వేశారు. హైదరాబాద్ కు చెందిన చాలిక చంద్రశేఖర్ గ్రాడ్యుయేట్ స్థానానికి రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. అలాగే అదిలాబాద్ కు చెందిన మంచికట్ల ఆశమ్మ ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు.

టీచర్స్ ఎమ్మెల్సీకి ముగ్గురు

టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కూర రఘోతంరెడ్డి, చాలిక చంద్రశేఖర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఒక్కొక్క సెట్టు నామినేషన్, సిలివేరు శ్రీకాంత్ రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆయా అభ్యర్థుల నుంచి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పమేలా సత్పతి నామినేషన్లను స్వీకరించారు. పోలీసులు ఈ మేరకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. కలెక్టర్ పమేలా సత్పతితో పాటు డిఆర్ఓ వెంకటేశ్వర్లు, పవన్ కుమార్ ఆర్డిఓ కే మహేశ్వర్, తహసిల్దార్లు పాల్గొన్నారు.