- రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు నిరంతర ప్రక్రియ
- ఈనెల 21 నుంచి 24 వరకు గ్రామసభలు
- కలెక్టర్లలో వీసీలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): అర్హులైన ప్రతీఒక్కరికి రేషన్‌కార్డులు జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రేషన్‌కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతరం ప్రక్రియలని పేర్కొన్నారు.
ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామసభల్లో దరఖాస్తులను స్వీకరించాలని, అలగే ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రేషన్‌కార్డుల లబ్ధిదారుల జాబితా, కులగణన సర్వే ఆధారంగా తయారు చేసినట్లు చెప్పారు. ఇదే ఫైనల్ కాదన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గ్రామ సభల నిర్వహణ, తదితర అంశాలపై శనివారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు మంత్రులు కీలక ఆదేశాలు చేశారు.
రెండు జాబితాలను ప్రదర్శించండి..
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంటి స్థలం ఉన్న వారి, లేనివారి జాబితాలను వేర్వేరుగా గ్రామసభల్లో ప్రదర్శించాలని మంత్రులు సూచించారు. అలాగే కొత్తగా గ్రామసభల్లో వచ్చే దరఖాస్తులనూ పరిశీలించాలన్నారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతీ భూమికి రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతీ కుటుంబంలో మహిళల బ్యాం కు ఖాతాలకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని బదిలీ చేస్తామని వెల్లడించారు.
గ్రామ సభలకు ఏర్పాట్లు చేయండి: సీఎస్ శాంతికుమారి
ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. గతంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల మాదిరే ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతిరోజూ ఒక గ్రామ పంచాయితీలో మాత్రమే గ్రామసభ నిర్వహించాలన్నారు.