శేరిలింగంపల్లి (విజయక్రాంతి): మాదాపూర్ లోని గ్రీన్కో కార్యాలయంలో ఏసీబీ మంగళవారం ఉదయం నుంచి ఈ సోదాలు నిర్వహిస్తోంది. గ్రీన్కో అనుబంధ సంస్థ ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ.41 కోట్ల ఎన్నికల బాండ్ల కొనుగోలు వ్యవహారంలో అధికారులు ఆరా తీస్తున్నారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం, గన్నవరంలోని ఏస్ నెక్స్ట్ జెన్ కార్యాలయాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల బాండ్ల పేరిట రూ. 41 కోట్ల బీఆర్ఎస్కు ఇచ్చిన నేపథ్యంలో దానిపై ఆరా తీస్తున్నారు. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలపై ఫోకస్ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు ప్రమోటర్‌గా వ్యవహరించిన గ్రీన్ కో, ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థల ఒప్పందాలపై ఆరా తీస్తోంది. గతంలో జరిగిన లావాదేవీలను సైతం పరిశీలిస్తోంది. సోదాల తర్వాత ఆ కంపెనీ ప్రతినిధులను ప్రశ్నిస్తోంది.
అప్పటి ఒప్పందాలపై నోటీసులు జారీ చేయనుంది. ఆపై విచారణకు పిలిచే అవకాశముంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఐపీఎస్ అధికారి దాన కిషోర్ నుంచి ఏసీబీ కీలక పత్రాలు తీసుకుంది. ఇంతకీ ఈ కంపెనీ డీటేల్స్‌లోకి వెళ్తే.. పాతికేళ్ల కిందట హైదరాబాద్ కేంద్రంగా గ్రీన్ కో సంస్థ ఏర్పాటైంది. తక్కువ సమయంలో భారీ కంపెనీగా ఎదిగింది. ఈ కంపెనీ వాళ్లకు వ్యాపార వర్గాలతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కంపెనీ డైరెక్టర్‌గా అనిల్ ఉన్న సమయంలో ఆయన బ్రదర్ సునీల్ ఎన్నికల్లో ప్రజారాజ్యం, టీడీపీ, వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెల్సిందే. గ్రీన్ కో సంస్థ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో అనేక ప్రాజెక్టులు చేపట్టింది. వివిధ రాష్ట్రాల్లో ఆ కంపెనీ దక్కించుకున్న ప్రాజెక్టులు కలిపితే దాదాపు లక్ష కోట్ల వరకు ఉంటాయన్నది. గడిచిన పదేళ్లు తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కార్‌తో ఈ కంపెనీకి సన్నిహిత సంబంధాలున్నట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.