- ఏపీలోని ఆ సంస్థ కార్యాల్లోనూ తనిఖీలు
- 41కోట్ల విలువైన ఎన్నికల బాండ్ల కొనుగోలుపై ఆరా
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (విజయక్రాంతి)/శేరిలింగంపల్లి: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో అనూహ్యపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హైకోర్టు తీర్పుతో ఈ కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్‌కో కార్యాలయాల్లో మంగళవారం తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్‌తోపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించారు. నగరంలోని మాదాపూర్‌లో గల గ్రీన్‌కో కార్యాలయంలో మంగళవారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. మాదాపూర్‌లోనే ఉన్న గ్రీన్ కో అనుబంధ సంస్థ ఏస్ నెక్స్‌జెన్, ఏస్ అర్బన్ రేస్, ఏపీ మచిలీపట్నంలోని ఏస్ అర్బన్ డెవలపర్స్ కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
బీఆర్‌ఎస్ హయాంలో రూ.41 కోట్ల ఎన్నికల బాండ్ల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ-2గా ఉన్న హెచ్‌ఎండీయే మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీయే మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డి నివాసాల్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది.
తెలంగాణ నుంచి వెళ్లిన ఏసీబీ ఉన్నతాధికారుల బృందం అధికారులు ఏపీలోనూ సోదాలు చేశారు. గ్రీన్ కో సంస్థల అధినేత చలమశెట్టి సునీల్ స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం సహా గన్నవరంలోని ఎస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయాల్లో తెలంగాణ ఉన్నతాధికారుల బృందం అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఎన్నికల బాండ్ల పేరిట రూ.41 కోట్లు బీఆర్‌ఎస్‌కు ఇచ్చిన నేపథ్యంలో దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 2022 అక్టోబర్ 25న ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన త్రైమాసిక ఒప్పందం జరగగా.. అంతకు ముందు అదే ఏడాది ఏప్రిల్‌లో రూ.31 కోట్లు, అక్టోబర్‌లో రూ.10 కోట్లు గ్రీన్ కో అనుబంధ సంస్థలు ఎలక్టోరల్ బాండ్లను సమకూర్చడంపై ఏసీబీ ఆరాతీస్తోంది.
ఈ నేపథ్యంలో గ్రీన్‌కో దాని అనుబంధ సంస్థలపై ఫోకస్ చేశారు. ఫార్ములా ఈ- కారు రేసు ప్రమోటర్‌గా వ్యవహరించిన గ్రీన్‌కో ఎస్ నెక్స్‌జెన్ సంస్థల ఒప్పందాలపై ఆరా తీస్తున్నారు. గ్రీన్‌కో అనుబంధ సంస్థలపై ఫోకస్‌పెట్టారు. గతంలో జరిగిన లావాదేవీలను సైతం పరిశీలించారు. సోదాల తర్వాత ఆ కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు. అప్పటి ఒప్పందాలపై నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆపై విచారణకు పిలిచే అవకాశముంది.
బీఆర్‌ఎస్‌తో సన్నిహిత సంబంధాలు
గ్రీన్‌కో సంస్థ 25 ఏండ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైంది. తక్కువ సమయంలోనే పెద్ద సంస్థగా ఎదిగింది. ఈ కంపెనీ వాళ్లకు వ్యాపార వర్గాలతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కంపెనీ డైరెక్టర్‌గా అనిల్ ఉన్న సమయంలో ఆయన సోదరుడు సునీల్ ప్రజారాజ్యం, టీడీపీ, వైసీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. కాగా గ్రీన్ కో సంస్థ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ అనేక ప్రాజెక్టులు చేపట్టింది. వివిధ రాష్ట్రాల్లో ఆ కంపెనీ ప్రాజెక్టులు దాదాపు రూ.లక్ష కోట్ల వరకు ఉంటాయని భావిస్తున్నారు.