07-03-2025 12:24:10 AM
రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్
జగిత్యాల అర్బన్, మార్చి 6(విజయ క్రాంతి): జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయం పై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ మహేష్ నుండి మున్సిపల్ కమిషనర్ కందుకూరి శ్రీనివాస్ రూ. 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో గత మూడు సంవత్సరాలుగా ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న మహేష్ కు గత ఆరు నెలలుగా జీతం పెండింగులో ఉంది.
మున్సిపల్ కమిషనర్ ను జీతం విషయం అడిగితే తనను తోటి ఉద్యోగుల ముందు అవమానించారని అంతటితో ఆగకుండా రు.20 వేలు లంచం ఇస్తేనే బిల్లులు చేస్తానని చెప్పడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు మహేష్ బుధవారం రూ.20 వేల నగదును కమిషనర్ శ్రీనివాస్ కు అందజేశాడు. అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు కమిషనర్ శ్రీనివాసును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి ఏసిబి కోర్టులో హాజరు పరిచనున్నట్లు డిఎస్పి రమణమూర్తి తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగినా, తీసుకున్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని ఏసిబి డిఎస్పి రమణమూర్తి తెలిపారు.