calender_icon.png 20 November, 2024 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన అంతర్గాం తహసీల్దార్

20-11-2024 02:44:10 AM

రూ.౧౨ వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

అధికారులను చూసి పరారైన ఆర్‌ఐ

పెద్దపల్లి, నవంబర్ 19 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు కలకలం రేపాయి. అంతర్గాం తహసీల్దార్ రమేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. లంచం డబ్బుతో ఉన్న ఆర్‌ఐ శ్రీధర్‌బాబు అధికారులను చూసి పరారయ్యాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండంకు చెందిన ఆలంకుంట మహేశ్ ఇసుక కాంట్రాక్టర్. మూడు రోజుల క్రితం అంతర్గాం పోలీస్‌లు మహేశ్‌కు చెందిన ఇసుకలోడుతో ఉన్న ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించడంతో ట్రాక్టర్‌ను తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించారు.

మహేశ్ కార్యాలయానికి వెళ్లగా.. ట్రాక్టర్ కావాలంటే జరిమానాతో పాటు రూ.50 వేలు లంచం ఇవ్వాలని తహసీల్దార్ రమేశ్ డిమాండ్ చేశాడు. చివరకు రూ.25 వేలకు ఒప్పుకున్నాడు. మరుసటి రోజు మహేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు మహేశ్‌కు రహస్య కెమెరా ఇచ్చి మళ్లీ తహసీల్దార్ వద్దకు పంపించారు. తహసీల్దార్ రమేశ్‌కు, బాధితుడికి మధ్యలో జరిగిన సంభాషణ అంతా అందులో రికార్డు చేశారు. చివరకు రూ.12 వేల లంచం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.

మంగళవారం మహేశ్ జరిమానా డబ్బులతో పాటు లంచం డబ్బులతో వెళ్లగా ఆర్‌ఐ శ్రీధర్‌బాబుకు ఇవ్వాలని తహసీల్దార్ చెప్పాడు. మహేశ్ ఆ డబ్బులను ఆర్‌ఐకి అప్పగించాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు వెళ్లగా గమినించిన ఆర్‌ఐ శ్రీధర్‌బాబు తన చేతిలో ఉన్న డబ్బులను బయటపడేసి పరారయ్యాడు. అధికారులు తహసీల్దార్ రమేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆర్‌ఐ శ్రీధర్‌బాబును కూడా త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.