17-12-2024 01:23:06 AM
అరెస్టు తప్పదా.. X అరెస్టుపై చెప్పలేను..
ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో విచారణకు గవర్నర్ ఆమోదం
కిం కర్తవ్యం! X బాంబు పేలింది!
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ఈ-కార్ రేసు వ్యవహా రంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును విచారించేందుకు ఇప్పటికే అనుమతి లభిం చిందని, గవర్నర్ అనుమతితో జారీచేసిన ఫైల్‌ను ఇవ్వాళ రాత్రి లేదా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీబీకి పంపిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
చట్ట ప్రకారంగా ఈ వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు సాగిస్తుందని తెలిపారు. గవర్నర్ ఇచ్చిన అనుమతిపై క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగిందని మంత్రి తెలిపారు. ఈ వ్యవహారంలో జరిగిన దోపిడీ, గత ప్రభుత్వంలోని పెద్దలు స్వలాభం కోసం చేసిన పనులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించామన్నారు. క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
‘కేటీఆర్ అరెస్ట్‌పై నేనేమి చెప్పలేను. చట్టం తన పని తాను చేస్తుంది. బాంబు తుస్సుమన్నదని ఇటీవల బీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. ఆ బాంబు తుస్సుమనేదైతే వారు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేశారు?’ అని మంత్రి అన్నారు. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని ఈ రేసులో కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారని తెలిపారు. కేటీఆర్‌ను అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని అనడం వాళ్ల అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.
విదేశాలకు డబ్బులు పంపితే..
ఈకార్ రేసు వెనుక చాలా పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని, తీగ లాగితే డొంక కదులుతోందని మంత్రి పొంగులేటి అన్నారు. స్వదేశీ డబ్బులు విదేశాలకు పంపినప్పుడు ఆర్బీఐ అనుమతి అవసరమని, ఆ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాల్సి ఉంటుందన్నారు. విదేశీ కంపెనీలతో ఆగ్రిమెంట్ అయితేనే నిధులు ఇవ్వాలన్నారు.
గూండాల్లా ప్రవర్తించారు..
‘అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కాకుండా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గూండాల్లా ప్రవర్తించారు. మాట్లాడటానికి అంశం లేనందునే వారు ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో సభకు ఆటంకం కలిగించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సభను నడిపిన తీరు అందరికి తెలుసు’ అని మంత్రి పొంగులేటి తెలిపారు.
కేసీఆర్ కొసరు కొట్లాట
కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కొసరుతో కొట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనతో కూర్చొని మాట్లాడాలని తనకు వ్యక్తిగతంగా కోరిక ఉందని తెలిపారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందనడం పచ్చి అబద్ధమని మంత్రి పొంగులేటి అన్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాగానే రియల్ ఎస్టేట్ అంతా అక్కడికి పోతుందనేది కేవలం ప్రచారం మాత్రమేనని స్పష్టంచేశారు.
అమరావతిలో వరదల వల్ల పెట్టుబడిదారులు భయపడుతున్నారని.. ఫలితంగా ఏపీకి పెట్టుబడులు కూడా వెళ్లే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్,- బెంగుళూరుకు ఇన్వెస్టర్లు వస్తున్నారని ఆయన అన్నారు. హైడ్రా భయం ప్రజల్లో ఇప్పుడు లేదని.. మొదట్లో తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు నిజం తెలిసిపోయిందన్నారు. గత ప్రబుత్వం చేసిన అప్పులపై కేటీఆర్ నిజాలు తెలుసుకోవాలన్నారు.
కార్పొరేషన్ లోన్స్‌తో కలిపి మొత్తం లెక్కలను బీఆర్‌ఎస్ నాయకులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పేరుతో చేసే అప్పులు సైతం ప్రభుత్వం ఖాతాలోకి వస్తాయని కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. కార్పొరేషన్లు ఒక్క రూపాయి కూడా స్వంతంగా జనరేట్ చేసుకునే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో రూ. 7 లక్షల 20 వేల కోట్ల అప్పులు ఉన్నాయన్నారు.
శాసన సభలో ఎవరి పాత్ర వారిదేనని... ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేందుకు వాళ్లకు హక్కుందని అయితే డిఫ్యూటీ సీఎంపై ప్రివిలైజ్ మోషన్ ఇవ్వడం అర్థరహితమన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెరుగుతున్నదని అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని...
వైఎస్‌ఆర్ సమయంలో ఇలానే ప్రచారం జరిగిందని గుర్తుచేశారు. రెండు మూడేళ్లలో అన్నీ సర్దుకుంటాయని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీనే రాష్ర్టంలోనూ అమలు జరుగుతుందని స్పష్టం చేశారు.
భూమిలేని నిరుపేదలకు రూ. 12వేలు సాయం...
భూమిలేని నిరుపేదలకు రూ.12వేలు సాయం అందిస్తామని.. సుమారు 15 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. ఇందుకోసం రూ. 1,000 కోట్లు విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సంక్రాంతికి రైతు భరోసాతో పాటు ఆసరా పింఛన్ల విడుదలకు యత్నిస్తున్నామని తెలిపారు.
సన్న వడ్లకు బోనస్‌ను వచ్చే పంటకు కూడా ఇస్తామని అన్నారు. ఏపీ నుంచి బోనస్ కోసం తెలంగాణలో వడ్లు అమ్మేందుకు చేసే ప్రయత్నాలను తమ సర్కారు కఠినంగా అడ్డుకుంటుందన్నారు. సినీ పరిశ్రమను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని.. తమకు సినిమా వాళ్లు, జర్నలిస్టులు, ప్రజలు అందరూ సమానమేనని స్పష్టం చేశారు.
పాదయాత్రనా.. మోకాళ్ల యాత్రనా..?
కేటీఆర్ అరెస్టు తర్వాత పాదయాత్ర చేస్తారా..? లేక మోకాళ్ల యాత్ర చేస్తారా..? అనేది వాళ్ల ఇష్టమని మంత్రి వ్యాఖ్యానించారు. జైలుకు పోయిన వారంతా ముఖ్యమంత్రి కాలేదన్నారు. ఈ కార్ రేసులో మొదటి విడతలో ముగ్గురు నుంచి నలుగురు ఉన్నారని తెలిపారు.
ఈ కేసులో అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌తోపాటు ఏజెన్సీలపైన కేసులు అవుతాయి. విచారణ జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేసే ముందు నిజనిర్దారణ చేసుకోవాలన్నారు.