- ఆరు నెలల్లో పాస్‌పోర్టు తిరిగి ఇవ్వాలని సూచన
- 13 నుంచి 23 వరకు విదేశీ టూర్‌కు ప్లాన్
- 17, 18 తేదీల్లో సింగపూర్‌లో పర్యటన
- 19న దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరు
హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశా లకు వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. జూన్ 6లోపు పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో బెయిల్ కోసం సీఎం రేవంత్‌రెడ్డి తన పాస్‌పోర్టును గతంలో కోర్టుకు అప్పగించారు.
విదేశాలకు వెళ్లే ప్రతిసారి కోర్టు నుంచి పాస్‌పోర్టును తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రాబోయే విదేశీ పర్యటనల నేపథ్యంలో పాస్‌పోర్టు కోసం కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో అనుమతి ఇచ్చింది. ఈ నెల 13 నుంచి 23 వరకు రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు.
ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, సింగపూర్ పర్యటనకు వెళ్లాల్సి ఉందని, ఆరు నెలలపాటు పాస్‌పోర్టు ఇవ్వాలని సీఎం అభ్యర్థించారు. సీఎం అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు పాస్‌పోర్టు ఇచ్చేందుకు అంగీకరించింది.
సీఎం పర్యటనలో స్వల్ప మార్పులు
సీఎం విదేశీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నట్టు తెలిసింది. అస్ట్రేలియా పర్యటన పూర్తిగా రద్దయింది. ఈ నెల 14న సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. 15,16వ తేదీల్లో ఢిల్లీలోనే ఉండనున్నారు. 15న ఢిల్లీలో జరగనున్న ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొననున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
అనంతరం 17న సీఎం ఢిల్లీ నుంచి నేరుగా సింగపూర్‌కు వెళ్లనున్నారు. 17, 18 తేదీల్లో రెండు రోజులపాటు సింగపూర్‌లో పర్యటిస్తారు. అక్కడి నుంచి దావోస్‌కు వెళ్లి జనవరి 24 వరకు అక్కడే ఉండనున్నారు. 19న దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో సీఎం పాల్గొంటారని సీఎంవో కార్యాలయం ప్రకటించింది.
నేడు తిరుమలకు రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం తిరుమలకు వెళ్లనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. దీంతో ముందుగానే తిరుమల అధికారులకు సమాచారం ఇవ్వడంతో టీటీడీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే.