calender_icon.png 22 September, 2024 | 10:21 AM

ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్, ఎస్సై

26-07-2024 12:05:00 AM

  • లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు 
  • పరకాల, పాల్వంచలో ఏసీబీ దాడులు

హనుమకొండ/భద్రాద్రి కొత్తగూడెం, జూలై 25 (విజయక్రాంతి): భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.80వేలు లంచం డిమాండ్ చేసిన సబ్ రిజిస్టార్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం... పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురానికి చెందిన లడే రాజేశ్వర్‌రావు దంపతులకు ఇద్దరు కుమారులు శ్రీనివాస్, శ్రీకాంత్. రాజేశ్వర్‌కొడుకులకు సమానంగా పంచి ఇచ్చేందుకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం పరకాల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్‌గా ఉన్న బొట్ల నరేష్‌ను సంప్రదించగా సబ్ రిజిస్టార్ వద్దకు తీసుకెళ్లాడు.

సబ్ రిజిస్ట్రార్ సునీత ఆ భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసే నిమిత్తం రూ.80 వేలు లంచం అడిగారు. దీంతో శ్రీనివాస్ బుధవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం ఉదయం పరకాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద శ్రీనివాస్ నుంచి నరేష్ రూ.80వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో సబ్ రిజిస్ట్ట్రార్ సూచన మేరకు తాను డబ్బులు తీసుకున్నట్టు అంగీకరించాడు. సబ్‌రిజిస్ట్రార్ సునీత, నరేష్‌ను అదుపులోకి తీసుకుని,శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపర చనున్నారు.

ఏసీబీ వలలో పాల్వంచ ఎస్సై

న్యాయం కోసం వెళ్తే లంచం డిమాండ్ చేసిన ఓ ఎస్సైని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై రమేశ్ వివరాల ప్రకారం.. పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్‌లో పట్టణానికి చెందిన శ్రావణి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఆ కేసులో నిందితులైన ఐదుగురిని అరెస్టు చేసి చార్జిషీట్ దాఖలు చేయడానికి ఎస్సై రాము రూ.20వేలు లంచం అడిగాడు. ఈ విషయాన్ని శ్రావణి తన లాయర్ లక్ష్మారెడ్డికి చెప్పడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం ఉదయం లాయర్ లక్ష్మారెడ్డి నుంచి ఎస్సై రాము రూ.20 వేల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా  పట్టుకున్నారు.