- ఆదాయానికి మించిన ఆస్తులు
- 5.5 కోట్ల స్థిర, చరాస్తులు గుర్తింపు
- మరో 4.19 కోట్ల విలువైన అనుమానిత ఆస్తులు
- గతంలో 8 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన భూపాల్‌రెడ్డి
రంగారెడ్డి, అక్టోబర్ 22 (విజయక్రాంతి)/అబ్దుల్లాపూర్‌మెట్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండటంతో రంగారెడ్డి జిల్లా మాజీ అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు కేసు నమోదు చేశారు.
సోమవారం సాయంత్రం నుంచి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారం ఇందు అరణ్యలో భూపాల్‌రెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి రూ.5.5 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించి సీజ్ చేశారు.
అదే విధంగా మరో రూ.4.19 కోట్ల విలువైన అనుమానిత ఆస్తులను గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉండగా, భూపాల్‌రెడ్డి గత ఆగస్టు 13న లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం తెలిసిందే.
నిషేధిత భూముల జాబితా నుంచి 14 గుంటల భూమిని సరిచేసేందుకు రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని గుర్రంగూడ గ్రామానికి చెందిన రైతు ముత్యంరెడ్డి వద్ద భూపాల్‌రెడ్డి లంచం డిమాండ్ చేశాడు. దీంతో ముత్యంరెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించగా, వారి సూచనల మేరకు రూ.8 లక్షల లంచం ఇచ్చే క్రమంలో భూపాల్‌రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్‌రెడ్డి రెడ్ హ్యాండెండ్‌గా పట్టుబడ్డారు.
అనంతరం ఏసీబీ అధికారులు భూపాల్‌రెడ్డి, మధుమోహన్‌రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం భూపాల్‌రెడ్డి నివాసంలో రూ.16 లక్షల నగదుతో పాటు ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.