నేడు ఈడీ విచారణకు..
హైదరాబాద్, జనవరి 15(విజయ క్రాంతి): ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించడంతో తెలంగాణ ఏసీబీ అలర్ట్ అయినట్లు సమాచారం. ఈ నెల 10న ఏసీబీ విచారించినప్పుడు.. తన ప్రమేయం వల్లే నిధుల బదిలీ జరిగిందని ఆయ న అంగీకరించినట్లుగా ఆయనే మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిం దే.
మంత్రి హోదాలో తన విచక్షణాధికారం మేరకు నడుచుకున్నానని.. సమయాభావం వల్ల అనుమతుల గురించి ఆలోచించలేదని ఏసీబీ దర్యాప్తులో చెప్పినట్లుగా కేటీఆర్ అప్పుడు తెలిపారు. అప్పుడు సుమారు 7 గంటల పాటు విచారించిన ఏసీబీ.. 40 ప్రశ్నలను తిప్పితిప్పి ఒకే విధంగా అడిగారని మీడియాకు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల వల్లే మంత్రిమండలి అనుమతి తీసుకోలేదని కేటీఆర్ చెప్పినట్లుగా సమాచారం.
ఈ నెల 4వ తేదీనే ఏసీబీ విచారణకు వచ్చిన కేటీఆర్.. తన న్యాయవాదిని విచారణకు అంగీకరించనందునే హాజరు కావడం లేదంటూ ఏసీబీ ఆఫీసు నుంచి తిరిగి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే ఓసారి కేటీఆర్‌ను విచారించిన ఏసీబీ.. ఈ సారి విచారణ సందర్భంగా పూర్తి ఆధారాలతో ఊహించని విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
కేటీఆర్‌కు హైకోర్టు, సుప్రీంకోర్టులో అన్ని మార్గాలు మూసుకుపోయిన తరుణంలో కచ్చితమైన ఆధారాలతో ఆయనను అరెస్టు చేస్తారనే ప్రచారం సైతం నడుస్తోంది. మరోవైపు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. గురువారం ఉదయం 10.30కు నగరంలోని నందినగర్‌లో ఉన్న తన నివాసం నుంచి కేటీఆర్ ఈడీ విచారణకు బయలుదేరుతారు.
ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభమవుతుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మున్సిపల్ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డిలను ఈడీ ఇప్పటికే విచారించింది. అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే నిధుల బదిలీ జరిగినట్లుగా వీరు ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ జరిగిందని అన్ని ఆధారాలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్తున్నారు.
గతంలోనే ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్న కేటీఆర్.. తనపై ఎఫ్‌ఐఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగులో ఉందని అందుకే విచారణకు హాజరుకాలేనంటూ గడువు కోరారు. కేటీఆర్ విజ్ఞప్తి మేరకు గడువును ఇస్తూ, జనవరి 16న హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ని ఆధారాలు సేకరించిన ఈడీ.. ఈ కేసులో కేటీఆర్‌పై నేరారోపణలు రుజువు చేసి ఆయనను అరెస్టు చేసేందుకు పెద్దఎత్తున అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.