28-04-2025 07:12:11 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో వలకు అవినీతి తిమింగలం చిక్కింది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ అధికారిక సహాయం కోసం ఫిర్యాదుదారుడి నుండి రూ.22,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. శామీర్‌పేట పోలీస్ స్టేషన్ లో నమోదైన చీటింగ్ కేసు నుండి బాధితుడిని తప్పించేందుకు, సెల్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేందుకు శామీర్ పేట్ ఎస్ఐ పరశురాం రూ.2 లక్షలు లంచం డిమాండ్ డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పక్కా స్కెచ్ తో సోమవారం శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఏసీబీ అధికారులు ఎస్‌ఐ పరశురామ్ బాధితుడి నుంచి రూ.22 వేలు లంచం తీసుకుంటుండగా అధికారలు పట్టుకున్నారు. అనంతరం ఎస్‌ఐ పరశురామ్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ లో తనీఖీలు నిర్వహించారు.
ఎస్ఐ పరశురామ్ బాధితుల నుంచి విడతల వారిగా భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.ఎస్ఐ పరశురామ్ ప్రజా విధులను సక్రమంగా, నిజాయితీ లేకుండా నిర్వర్తించాడని, అతని వద్ద నుంచి లంచం మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత కోర్టు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అంతకుముందు ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్‌లో దాడులు నిర్వహించి ఫైళ్లను పరిశీలించారు. వారు ప్రత్యేకంగా పరశురామ్ దర్యాప్తు చేస్తున్న కేసులపై దృష్టి సారించారు. ఎస్ఐని అరెస్టు చేయడానికి ముందు పోలీస్ స్టేషన్‌లోని అతని సహచరుల నుండి వివరాలను సేకరించారు.