- ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు
- త్వరలో ఉమ్మడి నల్లగొండకు 60 కొత్త బస్సులు : మంత్రి పొన్నం
- మంత్రి కోమటిరెడ్డితో కలిసి నల్లగొండ డిపోలో కొత్త బస్సులు ప్రారంభం
నల్లగొండ, జూలై 13 (విజయక్రాంతి): అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవసరమైతే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని స్పష్టంచేశారు. సంస్థను నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చేందుకు అన్నివిధాలా చేయూతనిస్తుందని పేర్కొన్నారు.
త్వరలో ఆర్టీసీలో 3,035 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నల్లగొండ ఆర్టీసీ డిపోకు కేటాయించిన ఐదు నూతన బస్సులను శనివారం రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి మంత్రి పొన్నం నల్లగొండలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాకు దసరాలోగా 30 డీలక్స్, 30 ఎక్స్‌ప్రెస్ బస్సులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. నార్కట్‌పల్లి డిపోకు పూర్వవైభవం తీసుకువచ్చి అక్కడి నుంచి రాష్ట్రం నలుమూలలకు బస్సులు నడుపుతాయని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభు త్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్మికులకు ఇప్పటికే 21 శాతం డీఏ చెల్లించామని గుర్తు చేశారు.
వారి చెల్లించాల్సిన రూ. 200 కోట్ల బకాయిలను ఈ నెలాఖరు వరకు ఖాతా ల్లో జమ చేస్తామన్నారు. నూతనంగా వెయ్యి బస్సులు కొనుగోలు చేశామని, మరో 1500 బస్సులకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 100 బస్సులు కేటాయించాలని జిల్లా మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేయగా పొన్నం సానుకూలంగా స్పందించారు. అదనపు కలెక్టర్ పూర్ణచందర్‌రావు, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం రాజశేఖర్, డిప్యూటీ ఆర్‌ఎం శివశంకర్ పాల్గొన్నారు.