calender_icon.png 19 September, 2024 | 7:05 AM

అధికారులపై దుర్భాషలు.. విధులకు ఆటంకం..

07-09-2024 12:31:51 AM

  1. ఆందోళనకు దిగిన ఉద్యోగులు 
  2. కాంగ్రెస్ నేత ‘మెండి’ అరెస్టు 

కరీంనగర్, సెప్టెంబరు 4 (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయితోపాటు టీపీవో తేజశ్రీపై దుర్భాషలాడి విధులకు ఆటంకం కలిగించిన ఘటన కలకలం రేపింది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్, ప్రస్తుత 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత భర్త మెండి చంద్రశేఖర్(మార్షల్) గురువారం సాయంత్రం కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలోకి ప్రవేశించాడు. వివిధ అంశాలపై కమిషనర్, టీపీవోలను ప్రశ్నించడమే కాకుండా దుర్భాషలాడాడు.

అదేరోజు రాత్రి టీపీవో తేజశ్రీ.. కలెక్టర్ పమేలా సత్పతి ఎదుట కంటతడి పెట్టి ఇలా అయితే ఉద్యోగం చేయలేమని ఆందోళన చెందారు. మెండి చంద్రశేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నగరపాలక సంస్థ ఉద్యోగిపై దుర్భాషలాడి గొడవకు దిగిన నేతను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం టీఎన్‌జీవో సంఘం, మున్సిపల్ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ధర్నాకు దిగారు. ఇదిలా ఉండగా మెండి చంద్రశేఖర్ భార్య, కార్పొరేటర్ మెండి శ్రీలత శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అవినీతి గురించి ప్రశ్నించినందుకు తన భర్తపై కేసు నమోదు చేశారని ఆరోపించారు.