calender_icon.png 28 November, 2024 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం గైర్హాజరీ హక్కుల ఉల్లంఘన కాబోదు

15-10-2024 03:15:12 AM

కేఏ పాల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు 

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): అంతర్జాతీయ శాంతి, ఆర్థిక సమావే శాలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకాకపోతే హక్కుల ఉల్లంఘన కాబోదని హైకోర్టు స్పష్టంచేసింది. సీఎం సదరు సమావేశాలకు హాజరుకాకపోవడం హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

ప్రైవేటు సంస్థ నిర్వహించిన సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరుకావాలనే నిబంధన ఏమీలేదని స్పష్టం చేసింది. మౌఖికంగా ఇచ్చిన హామీకి అనుగుణంగా సమావేశానికి హాజరుకాకపోవడాన్ని తప్పుపడు తూ పిల్ దాఖలు చేయడాన్ని తప్పుపట్టింది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఏవిధమైన ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆస్కారం లేదని, కాబట్టి పిల్‌ను ప్రాథమిక దశలోనే కొట్టివేస్తున్నట్టు వెల్లడించింది.

జనవరి 30న జరిగిన అంతర్జాతీయ శాంతి, ఆర్థిక సమావేశాలకు హాజరవుతానని సీఎం హామీ ఇచ్చి, ఇప్పడు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కేఏ పాల్ వేసిన పిల్‌కు నెంబర్ కేటాయించేందుకు రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తడాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ సమర్థిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.

కేఏ పాల్ వ్యక్తిగతంగా ఆన్లైన్లో విచారణకు హాజరై వాదనలు వినిపిస్తూ.. సీఎం సమావేశాల్లో పాల్గొంటానని మౌఖికంగా హామీ ఇచ్చి, ప్రస్తుతం పాల్గొనకపోవడం ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. దీనిపై హైకోర్టు, అదేమీ హక్కులకు భంగం వాటిల్లడం కాదని తేల్చిచెప్పింది. ఒక రాజకీయ పార్టీ నేతగా ఫలానా సభ లేదా సమావేశాల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేయలేమని వెల్లడించింది.

ఆవిధంగా పిటిషనర్ కోరడం కూడా సరికాదంది. ప్రైవేటు సంస్థలు నిర్వహించే సమావేశాల్లో పాల్గొనాలన్న చట్టపరమైన బాధ్యత సీఎంపై లేదని తేల్చిచెప్పింది. సమావేశాల్లో సీఎం పాల్గొంటే పెట్టుబడులు ఆకర్షించవచ్చునని పిటిషనర్ ఎలాంటి ఆధారాలు చూపలేదని తప్పుపట్టింది.