20-03-2025 11:41:23 PM
ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం..!
తప్పుబడుతున్న డెమోక్రాట్లు..
ఈ శాఖ కింద లక్షల్లో పాఠశాలలు..
వాషింగ్టన్: ఇప్పటికే ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికా విద్యాశాఖను రద్దు చేసేందుకు ట్రంప్ వడివడిగా అడుగులు వేస్తున్నారని, ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై కూడా ఇప్పటికే సంతకం చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని డెమోక్రటిక్ నేతలు తప్పుబడుతున్నారు. ట్రంప్ ఇప్పటికే విద్యాశాఖలో అనేక మంది ఉద్యోగులను తొలగించారు.
తాజాగా ఆ శాఖనే లేకుండా చేసేందుకు ట్రంప్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యయాలను తగ్గించేందుకు ఏర్పడిన డోజ్ అధిపతి ఎలాన్ మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. విద్యాశాఖ సెక్రటరీ లిండా మెక్‌మోహన్ మాట్లాడుతూ.. ‘విద్యాశాఖను రద్దు చేసి మరలా రాష్ట్రాలకు అధికారం బదిలీ చేసేందుకు అన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం ప్రజలకు అందుతున్న సేవల్లో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలి’ అని తెలిపారు.
చట్టసభలు సమ్మతించాల్సిందే..
విద్యాశాఖను రద్దు చేయడం అంత సులువు కాదు. ఇందుకు చట్ట సభలు ఆమోదం తెలపాలి. ఒక వేళ చట్ట సభలు కనుక ఈ నిర్ణయాన్ని సమ్మతించకపోతే రద్దు అనేది ఆగిపోతుంది. ఈ శాఖలో అవినీతి రాజ్యమేలుతోందని ట్రంప్ ఇప్పటికే ఎన్నో సార్లు తెలిపారు. గత నెలలో ట్రంప్ మాట్లాడుతూ.. విద్యాశాఖను వెంటనే మూసేయాలని ఉందని కానీ కాంగ్రెస్ నుంచి మద్దతు అవసరం అని పేర్కొన్నారు. ఈ శాఖ ఏర్పడిన 1979 నుంచి ఇప్పటి వరకు మూడు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల నిధులను ఖర్చు చేసిందని వైట్ హౌస్ పేర్కొంది. ఇన్ని నిధులు ఖర్చు చేసినా విద్యార్థుల్లో సృజనాత్మకత పెద్దగా పెరగలేదనే ఆరోపణలున్నాయి.