- --. 1,462 తెలంగాణ సీట్లు ఆల్ ఇండియా కోటాలోకి
- రాష్ట్ర విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యే అవకాశం
- బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 30(విజయక్రాంతి): పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా రద్దుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. పీజీ మెడికల్ సీట్ల రిజర్వేషన్ల విషయంలో 50శాతం లోకల్ రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణతో పాటు, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉందన్నారు.
తద్వారా రాష్ర్టంలో పీజీ వైద్యుల కొరత ఏర్పడుతుందన్నారు. గురువారం హరీశ్‌రావు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనానికి రాష్ర్ట ప్రభుత్వం వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.
మెడికల్ కాలేజీల్లో అగ్రగామి ఉన్న తెలంగాణలో ఈ తీర్పు వల్ల స్థానిక విద్యార్థులు చదివే అవకాశం కోల్పోయే ప్రమాదముందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల 1,462 సీట్లు ఆల్ ఇండియా కోటాలోకి వెళ్లిపోతాయని ఆయన చెప్పారు.
తెలంగాణతో పాటు, దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏపీ విద్యార్థులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోబోతున్నారని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలు గడిచిన 77 ఏండ్లుగా వైద్య విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ప్రోత్సహించాయన్నారు.
తాజా తీర్పుతో స్థానిక విద్యార్థులకు వైద్య విద్య అందించాలనే ప్రభుత్వాల లక్ష్యాలు నీరుగారుతాయని, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై అవసరమైతే దక్షిణాది రాష్ట్రాలు అన్ని కలిసి రాజ్యాంగ సవరణకు పట్టుబట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.