05-04-2025 02:22:17 AM
హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): తెలంగాణ ఉన్నత విద్యామండలి డిగ్రీ ఉన్న త విద్యలో కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ కోర్సుల్లో భాగంగా నచ్చిన కోర్సులను ఎంపికచేసుకునే బకెట్ ఆఫ్ కోర్సెస్ (బీవోఎస్) సిస్టంకు ముగింపు పలికింది. మళ్లీ పాత విధానాన్నే అమలుచేయనుంది. మాసాబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామం డలి కార్యాలయంలో శుక్రవారం యూనివర్సిటీల వీసీల సమావేశాన్ని నిర్వహించారు.
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో బకెట్ సిస్టం రద్దు చేయాలని, దోస్త్‌ను కొనసాగించాలని నిర్ణయించాలని వీసీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఈ విద్యాసంవత్సరం నుంచి బకెట్ సిస్టం రద్దుచేయాలని నిర్ణయించారు. దోస్త్ యథావిధిగా ఉండనున్నది. 2021నుంచి డిగ్రీ కోర్సుల్లో బకెట్ ఆఫ్ కోర్సెస్ (బీవోసీ)ను అమలు చేస్తున్నారు.
మొత్తం డిగ్రీ కోర్సులను ఏ, బీ, సీ, డీ బకెట్లుగా విభజించారు. ఈ విధానంలో బీఎస్సీ గణితం తీసుకున్న విద్యార్థి సైకాలజీ వంటి కోర్సులనూ తీసుకునే అవకాశముంది. గతంలో పదుల సం ఖ్యలో ఉన్న డిగ్రీ కోర్సులు 505 కోర్సులయ్యాయి. సబ్జెక్టు కాంబినేషన్లు పూర్తిగా మా రిపోయాయి. ఎవరు ఏదైనా కాంబినేషన్లు తీసుకునే విధానముండేది. ఇకనుంచి ఈ విధానానికి స్వస్తి పలికారు.
అన్ని వర్సిటీల్లో కామన్ మార్కుల విధానం..
డిగ్రీలో ఇక నుంచి నిరంతర మూల్యాంకనం (కంటిన్యూస్ అసెస్‌మెంట్ ప్యాట్రన్) అమలుచేయాలని నిర్ణయించారు. అన్నివర్సిటీల్లో ఒకేలా ఎండ్ సెమిస్టర్ పరీక్షలను నిర్వహిస్తారు. డిగ్రీ ఎండ్ సెమిస్టర్ పరీక్షలను 50మార్కులకు నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈవిధానం లో ఒక పేపర్‌లో 100 మార్కులుంటే, 25 మార్కులకు ప్రాజెక్ట్ వర్క్ /అసైన్‌మెంట్, 25 మార్కులు మిడ్‌టర్మ్ పరీక్షకు, 50 మార్కులు ఎండ్ సెమిస్టర్‌కు ఉంటాయి.
డిగ్రీలో కొత్త కోర్సులకు నిర్ణయం..
-వీసీల సమావేశంలో అధికారులు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. బకెట్ సిస్టం రద్దుచేసినా ప్రస్తుతం చదువుతున్న వి ద్యార్థుల కోసం మరో రెండేండ్లపాటు ఈ విధానం అమల్లోనే ఉంటుంది. 2025 విద్యాసంవత్సరం నుంచి కొత్తగా ప్రవేశాలు పొందేవారికి మాత్రం బకెట్ సిస్టం ఉండదు. డిగ్రీ కోర్సుల సిలబస్‌ను 20 శాతం మార్చాలని నిర్ణయించారు. డిగ్రీలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఫిన్‌టెక్, రీసెర్చ్ అప్టిట్యూడ్ రంగాల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
కొత్తగా రూపొందించిన సిలబస్ 2025 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. రాష్ర్టంలోని అన్ని వర్సిటీల్లో డిగ్రీ కోర్సుల నిర్వహణకు కామన్ అకాడమిక్ క్యాలెండర్ రూపొందించారు. జూన్ 16 నుంచి ఫస్టియర్ తరగతులను ప్రారంభిస్తారు. ఏప్రిల్ 30కల్లా యూజీ పరీక్షలు పూర్తి చేయనున్నారు. ఇంటర్ ఫలితా లు విడుదల కాగానే దోస్త్ నోటిఫికేషన్ విడుదలచేస్తారు.
డిగ్రీ కోర్సులకు అఫిలియేషన్ త్వరగా పూర్తిచేసి, ఏప్రిల్ 30కల్లా కోర్సుల జాబితాను అప్‌లోడ్ చేయాలని వర్సిటీలకు ఆదేశాలిచ్చారు. దోస్త్ కన్వీనర్‌గా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి కొనసాగనున్నారు. ఇక పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ (సీపీగెట్) నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకే అప్పగించారు.