అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ట్రంపరితనం మొదలెట్టేశాడు. ట్రంప్ వస్తే తమ డాలర్ కలలు చిన్నాభిన్నం అవుతాయని అంతా భయపడిన విధంగానే తొలి రోజే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాడు. తన ట్రంపరితనం ఎలా ఉంటుందో గత పాలనలోనే రుచి చూపించిన ట్రంప్.. ఈ దఫా మరింత దూకుడు పెంచారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అగ్రరాజ్యంలో ఉంటున్న భారతీయులకు నిద్ర లేని కాలరాత్రులను మిగులుస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
- కంగారు పడుతున్న భారతీయులు
- భారీగా విదేశీ సుంకాలు
- డబ్ల్యూహెచ్‌వో, పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి బయటకి
- గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్పు
- క్యాపిటల్ హిల్ దాడి నిందితులకు ఊరట
- పుతిన్‌పైనా ఘాటు వ్యాఖ్యలు
- పౌరసత్వం విషయంలో రాజ్యాంగ సవరణ అవసరం
- భారత్‌పై ప్రభావం చూపనున్న పలు నిర్ణయాలు
- అమెరికాను గ్రేట్‌గా మార్చడమే లక్ష్యమన్న ట్రంప్
వాషింగ్టన్, జనవరి 21: అగ్రరాజ్య పౌరసత్వం కోసం అనేక మంది ఆశగా ఎదురు చూస్తుంటారు. చాలా మందికి ఇది లభించకపోయినా కానీ వారు అమెరికాలో ఉంటున్న సమయంలో జన్మించిన వారి పిల్లలకు జన్మతః పౌరసత్వం లభించేది. కానీ 47వ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టిన డొనా ల్డ్ ట్రంప్ దానిని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు.
దీంతో ఇన్ని రోజులు అమెరికాలో పుట్టిన వారికి వచ్చే జన్మతః పౌరసత్వం రద్దయినట్లే. 1868లో చేసిన 14వ రా జ్యాంగ సవరణ ద్వారా అక్కడ జన్మించిన పిల్లలకు జన్మతః పౌరసత్వం అందుతూ వస్తోంది. కానీ ఆ విధానం ప్రస్తుతం రద్దయిపోయింది.
సుంకాలతో చుక్కలు..
ప్రపంచ వాణిజ్యంలో సుంకాలు అనేవి చాలా కీలకం. అమెరికా ప్రపంచానికి పెద్దన్న లా ఉంటూ వస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాలు అమెరికాతో వాణిజ్యం చేస్తూ వస్తున్నాయి. కొత్తగా పదవి స్వీకరించిన ట్రంప్ తీసుకున్న నిర్ణయం వాణిజ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపనుంది. ఎప్పటి నుంచో పన్నుల విధానాలను వ్యతిరేఖిస్తూ వస్తున్న ట్రంప్.. అధికారం చేపట్టిన తొలి రోజే వివిధ దేశాలపై సుంకాలను విధిస్తూ ఆదేశాలిచ్చారు.
పొరుగు దేశాలైన మెక్సికో, కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఫిబ్రవరి 1 నుం చి 25శాతం, చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 60 శాతం, ఇతర దేశాల వస్తువులపై 10 శాతం పన్నులు విధించనున్నట్లు పేర్కొన్నారు. కెనడా, మెక్సికో దేశాల నుంచి అమెరికాలోకి నేరస్థులు అక్రమంగా వలస వస్తున్నారని ట్రంప్ మరోమారు ఆరోపించారు.
‘కెనడా, మెక్సికో నుంచి దిగుమతి అ య్యే వస్తువులపై 25 శాతం పన్నులు విధించాలని ఆలోచిస్తున్నాం’ అని ట్రంప్ తెలిపారు. అమెరికా పౌరుల మీద పన్నులు వేసి ఇతర దేశాలను సంపన్నులను చేసే బదులు.. ఆ దేశాల మీదే పన్నులు విధించి అమెరికన్ పౌ రులను సంపన్నులను చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. అంతే కాకుండా ఇతర దేశాలకు అమెరికా అం దజేసే సహాయాన్ని కూడా ట్రంప్ 90 రోజుల వరకు నిలిపివేశారు.
గల్ఫ్ ఆఫ్ మెక్సికో కాదిక..
అధికారం చేపట్టిన ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు. ప్రపంచంలోనే 9వ అతి పెద్ద జలవనరు అయిన గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ఇక నుంచి గల్ఫ్ ఆఫ్ అమెరికాగా వ్యవహరించనున్నట్లు ట్రంప్ తెలిపా రు. ట్రంప్ ప్రతిపాదనలను మెక్సికో వ్యతిరేఖించింది. గ్రీన్‌ల్యాండ్ కొనుగోలు విషయం లో అమెరికాతో డెన్మా ర్క్ కలిసి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అంత ఈజీ కాదు..
ఈ పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు తప్పకుండా రాజ్యాంగ సవరణ చేయాలి. కానీ అమెరికాలో రాజ్యాంగ సవరణ అనేది చాలా క్లిష్టతరమైన ప్రక్రియ. హౌస్‌తో పాటు సెనేట్‌లో కూడా 2/3 మెజారిటీ అవసరం. అలాగే ఆ తర్వాత రాష్ట్ర శాసనసభల్లో 3/4 మెజారిటీ కావాలి. ఈ నిర్ణయాన్ని డెమోక్రాట్లు వ్యతిరేఖిస్తున్న తరుణంలో రాజ్యాంగ సవరణ అనేది అంత సులభం కాకపోవచ్చు.
క్యాపిటల్ నిందితులకు ఊరట..
2021లో యూఎస్ క్యాపిటల్‌పై దాడి చేసిన నిందితులకు ట్రంప్ ఊరట కల్పించారు. ఆనాటి దాడుల్లో దాదాపు 1500 మంది వరకు పాల్గొన్నారు. తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మద్దతుదారులకు క్షమాభిక్ష ప్రసాదిస్తానని ట్రంప్ ఎన్నికల సమయంలోనే చెప్పారు. 2021లో బైడెన్ విజయాన్ని ధృవీకరించేందుకు క్యాపిటల్ భవనంలో సమావేశమైన కాంగ్రెస్‌పై దాడి చేసేందుకు, అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు క్యాపిటల్ భవ నంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారని పలు అభియోగాలు నమోదయ్యాయి. కానీ ప్రస్తు తం వారందరిపై ఉన్న కేసులను కొట్టివేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.
పారిస్ క్లుమైట్ ఒప్పందం నుంచి బయటకి
పారిస్ క్లుమైట్ ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఇలాగే చేశారు. ప్రపంచం మొత్తం వాతావరణ పరిస్థితులు దిగజారుతూ గ్లోబల్ వార్మింగ్ విపరీతంగా పెరుగు తున్న ఈ తరుణంలో ట్రంప్ నిర్ణయం అందరికీ ఆశ్చర్యం కలిగించేదే. ఈ ఒప్పం దం నుంచి అమెరికా బయటకు వచ్చేందుకు దాదాపు సంవత్సరం సమయం పట్టనుంది.
రష్యాను నాశనం చేస్తున్న పుతిన్
అధ్యక్ష కుర్చీని అధిరోహించిన ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద కూడా విరుచుకుపడ్డారు. ‘ఆయన ఉక్రెయిన్‌తో యుద్ధం చే స్తూ రష్యాను నాశనం చేస్తున్నట్లు కనిపిస్తోం ది. ఆయన వెంటనే ఒప్పందం చేసుకోవాలి. నేను ఆయన్ను త్వరలోనే కలవనున్నాను’ అని విలేకరులతో పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ విరమణ గురించి కూడా ట్రంప్ పలు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
భారత్‌నూ హెచ్చరించిన ట్రంప్
సుంకాల విషయంలో అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ భారత్‌ను కూడా భయపెట్టారు. అమెరికా ఎగుమతి చేసే వస్తువులపై భారత్ అధికంగా పన్నులు విధిస్తోందని ఆరోపిస్తూ వస్తున్న ట్రంప్ ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే భారత్ అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై కూడా అధిక పన్నులు విధించనున్నట్లు హెచ్చరించారు. డిసెంబర్‌లో ట్రంప్ ట్రేడ్ విధానంపై ప్రకటన చేస్తూ ఈ విధంగా స్పందించారు.
‘నా అడ్మినిస్ట్రేషన్ టిట్ ఫర్ టాట్ విధానం అవలంభించ నుంది. వారు పన్నులు విధిస్తే మేము కూడా అదే తరహాలో పన్నులు విధిస్తాం’ అని అన్నారు. ట్రంప్ చేష్టలు భారత వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపెట్టనున్నాయి. అమెరికా మార్కెట్ మీద ఆధారపడే పరిశ్రమలకు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నా యి. భారత ఎగుమతిదారులు అమెరికాకు ఎగుమతి చేసేందుకు మరిన్ని అడ్డంకులు ఎదురుకానున్నాయి. అంతే కాకుండా వారి ఉత్పత్తులకు అమెరికాలో ఆదరణ తగ్గనుంది.
డబ్ల్యూహెచ్‌వోకు బాయ్.. బాయ్
డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలుగుతున్నట్లు ఎగ్జిక్యూ టివ్ ఆర్డర్ మీద సంతకం చేశారు. ఏండ్లుగా చైనా కంటే ఎక్కువగా అమెరికా నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. “కరోనా విషయంలో సరైన విధంగా వ్యవహరించకపోవడం. ప్ర పంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఇతర వ్యాధుల విషయంలో కూడా డబ్ల్యూహెచ్‌వో పెద్దగా ప్రభావం చూపడం లేదని అం దుకే వైదొలుగుతున్నట్లు ఉత్తర్వుల్లో ఉంది”. డబ్ల్యూ హెచ్ వోకు అమెరికా అత్యంత భారీ స్థాయి లో నిధులు సమకూరుస్తూ వస్తుంది.
భారతీయుల ఆశలపై నీళ్లు..
జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేయడం ద్వారా ట్రంప్ భారతీయుల కలలను చిదిమేశాడు. 2024 చివరి నాటికి 5.4 మిలియన్ల ఎన్నారైలు అమెరికాలో ఉంటున్నారు. ఆ దేశ జనాభాలో వీరు 1.47 శా తంగా ఉన్నారు. ఈ 5.4 మిలియన్ల మం దిలో అమెరికాలో పుట్టిన వారు దాదాపు 34 శాతం మంది ఉన్నారు. ఇక మిగతా వారు అక్కడికి వలసవెళ్లి స్థిరపడినవారు.
గ్రీన్ కార్డు పొంది ఉన్న వారికి జన్మించినా, గ్రీన్ కార్డు లేని వారికి జన్మించినా కానీ అమెరికాలో జన్మిస్తే ఇన్ని రోజు లు ఆ దేశ పౌరసత్వం వచ్చేది. కానీ ఇప్పు డు ట్రంప్ ఆదేశాలతో అది రద్దు కానుంది.
* జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేసిన ట్రంప్ భారతీయులకు పెద్ద చేటు చేశారు.
* ఈ నిర్ణయం ద్వారా బర్త్ టూరిజం.. తగ్గిపోతుంది. వివిధ దేశాల్లో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వారు తమకు పుట్టబోయే పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించాలని డెలివరీ సమయంలో చాలా మంది అగ్రరాజ్యానికి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఆ టూరిజం అంతం కానుంది.
* ఈ నిర్ణయం ప్రభావం అందరిపైనా పడనుంది. అమెరికా ప్రజలు కూడా తమ పిల్లలు ఈ దేశానికి చెందిన వారే అని నిరూపించుకోవాల్సి వస్తుంది.
* ఉద్యోగావకాశాల కోసం అమెరికాకు వెళ్లిన చాలా మంది గ్రీన్ కార్డు పొందాలని ఉవ్విళ్లూరుతుంటారు. తాజా నిర్ణయంతో గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.