calender_icon.png 23 January, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏంజెల్ ట్యాక్స్ రద్దు

24-07-2024 01:18:56 AM

న్యూఢిల్లీ: దేశంలో స్టార్టప్‌లను ప్రోత్సహించి, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పలు కీలక విషయాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని రకాల పెట్టుబడిదారులకు ఏంజల్ ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు  తెలియజేశారు. మనీ ల్యాండరింగ్‌ను నిరోధించడం కోసం దుర్వినియోగ నిరోధక చర్యగా 2012 లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ ఏంజల్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టారు. ఏంజల్ ఇన్వెస్టర్లనుంచి నిధులు పొందే జాబితాలో లేని వ్యాపారాలకు ఈ ఏంజల్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఒక స్టార్టప్ ఏంజల్ ఇన్వెస్టర్‌నుంచి నిధులు స్వీకరించినప్పుడు దానిపై పన్ను చెల్లించాల్సి ఉం టుంది.

ఆదాయం పన్ను చట్టం 1961లోని సెక్షన్ 56(2)(vii)(బీ) ప్రకారం స్టార్టప్‌లు ఏంజల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది, అయితే స్టార్టప్‌కు వచ్చే పెట్టుబడి దాని ఫెయిర్ మార్కె విలువ(ఎఫ్‌ఎంవీ)కంటే ఎక్కువ ఉన్నప్పుడు సమస్య తలెత్తుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ స్టార్టప్ 30.9 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే వచ్చే మొత్తానికన్నా  చెల్లించే పన్నే ఎక్కువగా ఉండడంతో స్టార్టప్‌లలో పెట్టుబడుల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి.దీన్ని రద్దు చేయాలని స్టార్టప్‌ల వ్యవస్థాపకులు చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  ఇప్పుడు ఈ ఏంజల్ ట్యాక్స్‌ను రద్దు చేయడంపై స్టార్టప్‌ల వ్యవస్థాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.