calender_icon.png 1 November, 2024 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవిత, వైద్య బీమాపై జీఎస్టీని ఎత్తివేయండి!

01-08-2024 02:11:25 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరో మంత్రి గడ్కరీ లేఖ

న్యూఢిల్లీ, జూలై 31: ‘జీవిత, వైద్య బీమాపై 18శాతం జీఎస్టీని ఎత్తివేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ డివిజినల్ లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం నేతలు ఇటీవల ఆయన్ను కలిసి సమస్యను విన్నవించగా.. ఈ మేరకు ఆయన గత నెల 28న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. 18శాతం జీఎస్టీ విధింపుతో వయోవృద్ధులతో పాటు సాధారణ ప్రజలపై భారం పడుతుందని, తద్వారా బీమా రంగ వృద్ధికి ప్రతిబంధకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. జీవిత బీమాపై పన్ను విధించడమంటే ప్రజల జీవితాల్లోని అనిశ్చిత పరిస్థితులపైనా పన్ను విధించినట్లేనని స్పష్టం చేశారు. పన్ను తక్కువగా ఉంటే ప్రజలు బీమా తీసుకుంటారని, బీమా తీసుకుంటే వారికి మెరుగైన చికిత్స అందుతుందని పేర్కొన్నారు. తద్వారా బీమా రంగ వృద్ధికి ఢోకా ఉండదన్నారు. జీవితబీమాపై ఆదాయ పన్ను మినహాయింపు ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు.