calender_icon.png 6 February, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది ఫలితాల్లో సత్తా చాటాలి

06-02-2025 06:02:55 PM

అదనపు కలెక్టర్ దీపక్ తివారి..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): 10వ తరగతి వార్షిక ఫలితాలలో సత్తాచాటి జిల్లాను ముందంజలో ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల ప్రత్యేక అధికారులు, ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాల్ లతో 10వ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన దిశగా చేపట్టవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి వార్షిక పరీక్షలలో జిల్లాను రాష్ట్రంలోని ముందంజలో ఉంచాలని అన్నారు. 10వ తరగతి వార్షిక పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని, 10వ తరగతి పూర్తి అయిన తర్వాత ఉన్నత చదువుల దృష్ట్యా వివిధ మార్గాలను ఎంచుకొని లక్ష్యసాధనకు కృషి చేయాలని అన్నారు.

వార్షిక పరీక్షలకు ప్రణాళిక బద్ధంగా సన్నద్ధంకావాలని, ఎలాంటి ఒత్తిడి, అపోహలు లేకుండా ఏకాగ్రతతో చదవాలని తెలిపారు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు అదనపు తరగతులు, ఉదయం, సాయంత్రం వేళలలో స్టడీ అవర్లు నిర్వహించాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అదనపు తరగతులు నిర్వహించి పరీక్షలకు సన్నద్ధం చేయాలని తెలిపారు. ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ విద్యార్థులకు అందించాలని, వారంతా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల మార్కుల పురోగతిపై సమీక్షించాలని తెలిపారు. మండల విద్యాధికారులు ప్రతిరోజు 5 పాఠశాలలను సందర్శించాలని, ప్రధానోపాధ్యాయులు తరగతి గదులకు వెళ్లి ఉపాధ్యాయుల బోధన సరళిని పరిశీలించాలని తెలిపారు. పాఠ్యాంశాలు పూర్తి అయినట్లయితే తిరిగి సిలబస్ పఠనం చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్షల కమిషనర్ ఉదయ్ బాబు, సమన్వయకర్త శ్రీనివాస్, మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు, ప్రిన్సిపాల్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.