07-02-2025 11:26:08 PM
అబిడ్స్ సీఐ నరసింహ భార్య సంచలన ఆరోపణ..
అక్రమ కేసులు బనాయిస్తున్నాడని ఆవేదన..
ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్..
ఉట్కూరులో మీడియా ఎదుట బాధితురాలు..
నల్లగొండ (విజయక్రాంతి): తారాస్థాయికి చేరుకున్న అదనపు కట్నం వేధింపులు తాళలేక పోతున్నానని అబిడ్స్ సీఐ కుంభం నరసింహ భార్య మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకుంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఉట్కూరు గ్రామంలోని తన పుట్టింటి వద్ద శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడింది. నిత్యం ఇంట్లో భర్త నరసింహ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని భార్య సంధ్య ఆరోపించింది. పాపను తీసుకొని తల్లిదండ్రుల ఇంటికి వస్తే తనపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో అక్రమ కేసు బనాయించడాని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు విచారణ పేరుతో తనను వేధిస్తున్నారని, మరొకరిని పెళ్లి చేసుకొని పాపను హింసిస్తున్న కారణంగానే ఆమెను స్కూల్ నుంచి తీసుకొని పుట్టింటికి వచ్చినట్లు వెల్లడించింది.
]సీఐ నరసింహకు అక్రమ సంబంధాలున్నాయని అందుకే తనను వదిలించుకునేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నాడని వాపోయింది. ఉన్నతాధికారులు స్పందించి సీఐ నరసింహను విధుల నుంచి సస్పెండ్ చేయాలని కోరింది. 12 ఏండ్లుగా తనకు వేధింపులే మిగిలాయని, తల్లిదండ్రులను కూడా కలవనివ్వకుండా దూరం చేశాడని బాధితురాలు చెప్పింది. కాగా సీఐ దంపతుల నడుమ వివాదంపై హైకోర్టులో కేసు నడుస్తున్నట్లు తెలిసింది.