calender_icon.png 16 January, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభిషేక్

08-07-2024 02:29:12 AM

శతక్కొట్టిన శర్మ లెక్కసరిచేసిన టీమిండియా రెండో టీ20లో జయకేతనం

అంతర్జాతీయ అరంగేట్రంలో డకౌట్‌గా వెనుదిరిగిన భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ.. ద్వితీయ పోరులో అద్వితీయ ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్లో సిక్సర్లతో హోరెత్తించిన సన్‌రైజర్స్ ఓపెనర్.. జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపాడు. బంతి ఎక్కడ వేసినా దాని గమ్యస్థానం గ్యాలరీయే అన్నట్లు చెలరేగిపోయిన అభిషేక్ రికార్డు సెంచరీతో చెలరేగిన వేళ.. జింబాబ్వేతో రెండో టీ20లో భారత్ విజయపతకా ఎగరవేసింది. గత మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన బ్యాటింగ్ యూనిట్ ఈసారి కలిసికట్టుగా కదంతొక్కగా.. బౌలర్లు జోరు కొనసాగించారు. అభిషేక్ సుడిగాలి సెంచరీకి రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ మెరుపులు తోడవడంతో.. యంగ్ ఇండియా లెక్క సరిచేసింది. 

హరారే: పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అనంతరం భారత జట్టు ఆడిన తొలి పోరులో పరాజయం పాలవగా.. రెండో మ్యాచ్‌లో బదులు తీర్చుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తాచాటిన యంగ్‌ఇండియా ఆదివారం జరిగిన రెండో టీ20లో 100 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను గిల్ సేన 1 సమం చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (47 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా.. రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టారు.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (2) ప్రభావం చూపలేకపోయాడు. జింబాబ్వే బౌలర్లలో ముజర్‌బాని, మసకద్జా చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. వెస్లీ మధెవెరె (43) టాప్ స్కోరర్ కాగా.. ల్యూక్ జాంగ్వే (33) పర్వాలేదనిపించాడు. కెప్టెన్ సికందర్ రజా (4)తో పాటు తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. మన బౌలర్లలో అవేశ్ ఖాన్, ముఖేశ్ కుమార్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీశాడు. సెంచరీ వీరుడు అభిషేక్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం ఇక్కడే మూడో టీ20 జరగనుంది. 

నా హిట్టింగ్‌పై నమ్మకముంది. ఈ రోజు నాది. బాధ్యత తీసుకోవాలని అనుకున్నా. ఆరంభంలో ఆచితూచి ఆడి.. ఆ తర్వాత ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగా. నా పరిధిలో బంతి పడితే దానిపై విరుచుకుపడటం నా సహజ నైజం. తొలి మ్యాచ్‌లో విఫలమైన తర్వాత.. ఈ ప్రదర్శన నాకు ఆనందాన్నిచ్చింది. 

 -శర్మ