28-08-2024 12:39:29 AM
హైదరాబాద్, ఆగస్టు 27(విజయక్రాంతి) : తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. రాజ్యసభ అభ్యర్థిత్వానికి రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటిలో కాంగ్రెస్ నుంచి అభిషేక్ మనుసింఘ్వీ నామినేషన్ సమర్పించగా, రెండోది స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు బలపర్చకపోవడంతో పద్మరాజన్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది.
దీంతో అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. సింఘ్వీ తరపున పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకన్నారు. కాగా, అభిషేక్ మను సింఘ్వీ కాంగ్రెస్‌కు సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్నారు. 2001 నుంచి ఏఐసీసీ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు. 2006, 2018లో రెండుసార్లు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేసి బీజేపీ చేతిలో ఓటమిపాలయ్యారు.
ఈ క్రమంతో ఆయనను తెలంగాణ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. కే కేశవరావు రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభిషేక్ మనుసింఘ్వీని బరిలోకి దింపింది. రాజ్యసభ సభ్యత్వం కోసం స్థానిక నాయకులు ప్రయత్నించారు. కానీ, జాతీయ రాజ కీయాల్లో సింఘ్వీ సేవలు కాంగ్రెస్‌కు కీలకమైనందున ఆయనకే అధిష్ఠానం అవకాశం ఇచ్చిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.