calender_icon.png 8 October, 2024 | 5:53 AM

ఈబీసీ జోలికొస్తే దేశవ్యాప్త ఉద్యమం

08-10-2024 01:15:02 AM

అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయాలి

ఈబీసీ జాతీయ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి డిమాండ్

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ఈబీసీ రిజర్వేషన్ల జోలికొస్తే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని, అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయాలని ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఎన్నో ఏళ్ల తర్వాత బీసీ వర్గానికి చెందిన ప్రధాని మోదీ అగ్రవర్ణ పేదల దుస్థితి గమనించి విద్య, ఉద్యోగాల్లో ౧౦ శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చారని తెలిపారు.

కొందరు కుల విద్వేషాలు రెచ్చగొడుతూ అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీకి అగ్రవర్ణాలను దూరం చేసి తద్వారా వారు రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు కుట్రలో భాగంగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పావుగా వాడుకుంటున్నారని అన్నారు.

నిజంగా బీసీ వర్గాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీ రిజర్వేషన్ల విధానాల్లోనూ ఆదాయ పరిమితి విధించమని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. బీసీలలోని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేల పిల్లలే రిజర్వేషన్లను తన్నుకుపోతున్నారని, నిజమైన పేదలకు అవకాశాలు దక్కడం లేదని ఆరోపించారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణ పేదల విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అగ్రవర్ణ పేదలను సంఘటితం చేసి కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని బహిర్గతం చేస్తామని హెచ్చరించారు.