calender_icon.png 26 October, 2024 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెర్రరిస్ట్ ఫ్యాక్టరీగా అబోటాబాద్

26-10-2024 12:21:24 AM

బిన్ లాడెన్ నివాసం కేంద్రంగా కార్యకలాపాలు

పసిగట్టిన భారత ఇంటెలిజెన్స్

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఉగ్రవాదానికి కేంద్రంగా పాకిస్థాన్ మారింది. ఆ దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న అబోటాబాద్ ఈసారి వార్తల్లోకి వచ్చింది. అబోటాబాద్ కేంద్రంగా ఓ మెగా టెర్రరిస్ట్ ఫ్యాక్టరీని పాకిస్థాన్ నడుపుతున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఇటీవల జమ్ముకశ్మీర్‌లో టెర్రరిస్ట్‌లు కాల్పులు జరిపి పలువురిని చంపడం తో భారత ఐబీ వర్గాలు పాక్‌పై ప్రత్యేక దృష్టి సారించడంతో టెర్రరిస్ట్ క్యాంప్ విషయం బయటకు వచ్చింది. ఈ విషయాన్ని ఓ జాతీయ వార్తాపత్రిక పేర్కొంది. పాక్ ఐఎస్‌ఐకి చెందిన ఓ ఆర్మీ జనరల్ ఈ టెర్రిరిస్ట్ క్యాంపును నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ఇక్కడ లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలు భారీ టెర్రరిస్ట్ క్యాంప్‌ను ఏర్పాటు చేసి యువకులు, యువతులకు ఆయుధ వినియోగం, ఉగ్ర విషయాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాలన్నింటిని బిన్ లాడెన్ ఇంటి ని కేంద్రంగా చేసుకుని నిర్వహిస్తున్నారు.  అబోటాబాద్ పట్టణంలోనే ఓ ఇంట్లో  దాక్కున్న అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను 2011లో అమెరికా పాక్‌లోకి రహస్యంగా వచ్చి చంపేసింది.